2014 మే 26... కేంద్రంలో తొలిసారి నరేంద్రమోదీ సర్కారు కొలువుదీరిన రోజు. అదే ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టారు అరుణ్ జైట్లీ. భారత 26వ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఫిబ్రవరి 29న లీప్ సంవత్సరం సహా.. ఆయన పార్లమెంటులో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
విత్త మంత్రిగా జైట్లీ: జీఎస్టీ నుంచి బడ్జెట్ 2.0 వరకు...
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్వచ్ఛ రాజకీయాలు, న్యాయ చతురతకు పెట్టింది పేరు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో సమాచార- ప్రసార, రక్షణ, న్యాయ... ఇలా పలు మంత్రిత్వ శాఖల బాధ్యతల్ని నిర్వర్తించినప్పటికీ విత్త మంత్రిగా జైట్లీ చేసిన సేవలు మరువలేనివి. ఆర్థిక మంత్రిగానే ఆయనను ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు.
ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ సంస్కరణలు
ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ...
- ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పరోక్ష పన్నుల సంస్కరణ జైట్లీ హయాంలోనే జరిగింది. 2017 జులై 1న ఒకే దేశం-ఒకే పన్ను విధానంతో వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని తీసుకొచ్చారు. జీఎస్టీ చట్టాన్ని రూపొందించేందుకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఒప్పించడంలో జైట్లీ పాత్ర కీలకం. జీఎస్టీ మండలికి రాజ్యాంగహోదా కల్పించేందుకు కృషి చేశారు.
- భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఏర్పాటుచేయాలని జైట్లీ ఒత్తిడి తెచ్చారు. ద్రవ్యోల్బణం పట్ల ఆయన దూరదృష్టితో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలనిచ్చింది. ఫలితంగా.. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం(సీపీఐ) 7.72 నుంచి 3 శాతానికి దిగొచ్చింది.
- బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తుల ప్రక్షాళనకు పూనుకున్నారు. దివాలా తీసిన సంస్థల సమస్యలకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం లభించే విధంగా దివాలా స్మృతి(ఐబీసీ) పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ఘనత జైట్లీకే దక్కుతుంది. 2016లో ఐబీసీ పార్లమెంటు ఆమోదం పొందింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థల విలీనం జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా సహా భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అయ్యాయి. జైట్లీ హయాంలోనే విజయా బ్యాంక్, దేనా బ్యాంక్... బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. 1969,80లలో బ్యాంకుల జాతీయకరణ అనంతరం.. బ్యాంకింగ్ రంగంలో ఇవే అతిపెద్ద సంస్కరణలుగా పేరుగాంచాయి.
- బడ్జెట్ సంస్కరణలపై జైట్లీది ప్రత్యేక అజెండా. ప్రణాళిక, ప్రణాళికేతర, రైల్వే బడ్జెట్ వ్యయాల్లో కృత్రిమ వ్యత్యాసాల్ని పోగొట్టేందుకు ఆయన విధానం ఉపకరించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ సంప్రదాయాన్నీ జైట్లీ మార్చారు. 2017 నుంచి ఏటా ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.
- పెద్ద నోట్ల రద్దు.. 2016లో జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది.
- ద్రవ్య ప్రయోజనాలు, రాయితీలు నేరుగా బదిలీ చేసేందుకు జన్‌ధన్, ఆధార్, మొబైల్ త్రయాన్ని ప్రయోగించి విజయవంతం అయ్యారు అరుణ్ జైట్లీ. ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్లు మిగిలాయి.
- ద్రవ్యలోటును 3.5 శాతానికి అటూఇటుగా ఉండేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు జైట్లీ. విజయం సాధించారు.
Last Updated : Sep 28, 2019, 2:49 AM IST