కరోనా సంక్షోభంతో చాలా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో స్థిరాస్తి రంగం కూడా కీలకమైంది. అయితే ఇళ్ల కొనుగోలుకు మాత్రం ప్రస్తుత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తులో గృహ స్థిరాస్తి రంగం మంచి ప్రదర్శన కనబరుస్తుందని రియల్టీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి.
తగ్గిన వడ్డీ రేట్లు
సంవత్సరం క్రితం గృహ రుణంపై వడ్డీ రేట్లు 8 నుంచి 9 శాతం మధ్యలో ఉండేవి. ఇప్పుడు 7 శాతం వద్ద ఉన్నాయి.
ఏడాది ముందు రూ.40 లక్షలు 8.5 శాతం వడ్డీతో 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.34,713గా ఉండేది. అదే రుణాన్ని ఇప్పుడు 7 శాతం వడ్డీతో తీసుకుంటే రూ.3,701 రూపాయలు తగ్గి ఈఎంఐ రూ.31,012 ఉంటుంది.
వడ్డీ రేట్ల తగ్గుదలతో పాటు.. పలు ఇతర కారణాలతో ఇళ్ల కొనుగోలుకు ఇప్పుడు అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గృహ కొనుగోలుకు కావాల్సిన మార్జిన్ డబ్బులు ఉన్నట్లయితే కొనుగోలు చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
అందుబాటు ధరలో ఇళ్లు...
ఇళ్ల ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి రంగ ప్రతినిధులు చెబుతున్నారు. డెవలపర్లు తమపై ఆర్థిక భారం పడకుండా.. ధరలు మరింత తగ్గించేందుకు మొగ్గు చూపొచ్చని అంటున్నారు. ఈ కారణాలతో చాలా ప్రాంతాల్లో ఇంతకుముందు నిర్మాణ దశలో ఉన్న ఇంటి ధరకే.. ప్రస్తుతం పూర్తి చేసిన ఇల్లు వస్తోందని స్థిరాస్తి విశ్లేషకులు చెబుతున్నారు.