దేశార్థికం సానుకూల వృద్ధి దిశగా పయనిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడి.. సానుకూల వృద్ధి రేటు నమోదవ్వచ్చని అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"తయారీ, సేవ రంగాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీడీపీ క్యూ3లో .. రెండో త్రైమాసికంతో పోలిస్తే -7.5 శాతం నుంచి 1.1 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి."
-పృథ్వీరాజ్ శ్రీనివాస్, యాక్సిస్ క్యాపిటల్ ప్రధాన ఆర్థికవేత్త
- 2020-21 మూడో త్రైమాసిక అధికారిక జీడీపీ గణాంకాలను కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేయనుంది.
తీవ్ర సంక్షోభం..
కరోనా వల్ల గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం స్వాతంత్ర్యం అనంతరం ఈ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.
2020-21 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు అత్యధికంగా 23.9 శాతం క్షీణించింది. రెండో త్రైమాసికంలో ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన కారణంగా కాస్త కోలుకుని -7.5 శాతంగా నమోదైంది. ఇదే వేగంతో క్యూ3లో సానుకూల వృద్ధి రేటు నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వృద్ధి రికవరీకి సంకేతాలివే..
'దేశార్థికం 2020-21 ద్వితీయార్థంలో సానుకూల వృద్ధి నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగటం ఇందుకు ప్రధాన కారణం..' అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా ఈ నెల ఆరంభంలో జరిగిన ఎంపీసీ సమావేశంలో పేర్కొన్నారు. టోల్ వసూళ్లు, ఈ-వే బిల్లులు, ఉక్కు వినియోగం పెరగటం వంటివి రికవరీని స్పష్టంగా సూచిస్తున్నట్లు తెలిపారు.
డిమాండ్ పెరగటం సహా వివిధ కారణాలు వృద్ధి రేటు రికవరీకి ఊతమిస్తున్నట్లు పృథ్వీరాజ్ శ్రీనివాస్ వివరించారు.
'డిమాండ్ వృద్ధి, ప్రజా వ్యయాలు సాధారణ స్థితికి చేరుతుండటం వంటివి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సానుకూల వృద్ధికి కారణమవ్వచ్చు.' అని 'ఈటీవీ భారత్'తో అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా క్యూ3లో జీఎస్టీ వసూళ్లు ఈ అంచనాలన్నింటికీ దన్నుగా నిలుస్తున్నట్లు వివరించారు.
అధికారిక గణాంకాల ప్రకారం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రతి నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లపైనే నమోదయ్యాయి. 2020 డిసెంబర్లో అత్యధికంగా రూ.1,15,174 కోట్లు వసూలవ్వడం గమనార్హం.
సంక్షోభంలోనూ వ్యవసాయం భళా..
కరోనా వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. వ్యవసాయ రంగం మాత్రం సానుకూలంగా స్పందించింది. 2020-21 మొత్తం మీద ప్రతి త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటును నమోదు చేసిన రంగంగా వ్యవసాయం నిలవనుంది.
2020-21 క్యూ1లో తయారీ రంగం 47 శాతం, సేవా రంగం 39.3 శాతం క్షీణించాయి. వ్యవసాయ రంగం మాత్రం 3.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి త్రైమాసికంలో వ్యవసాయ అనుబంధ రంగాలూ సానుకూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి:'కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే పెట్రో ఊరట'