మెరుగైన ఆర్థిక విధానాలు, ఉద్దీపన పథకాలతో కరోనా ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ బయటపడి 'వీ' ఆధారిత వృద్ధిరేటు సాధించవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించారు. చమురు ధరలు దిగిరావడం, వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఆరంభించేందుకు చిన్నతరహా, భారీ పరిశ్రమలకు బ్యాంకులు రుణాలిచ్చేలా కేంద్ర ప్రభుత్వం రుణ భరోసా (క్రెడిట్ గ్యారంటీ), ప్రోత్సాహక పథకాలు తీసుకురావాల్సిన అవసరముందని వెల్లడించారు. ఆదివారమిక్కడ మంథన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కరోనా వైరస్ సంక్షోభ సవాళ్లు - ఆర్థిక వ్యవస్థ' అంశంపై వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
ఈ ఉద్దీపన పెరగాలి...
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, సంస్కరణలు, విధానాలు అవసరం. కరోనా సంక్షోభ తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇచ్చిన 0.8 శాతం జీడీపీ ఉద్దీపన ప్యాకేజీ సరిపోదు. ప్రభుత్వం మరింతగా ఖర్చు చేయాలి. జీవనోపాధి చూపేలా చర్యలుండాలి. వైద్య మౌలిక సదుపాయాలు కల్పించాలి. కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాదికి 2.1 అదనపు జీడీపీకి అనుగుణంగా అప్పులు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ద్రవ్యలోటు 6.5 శాతంగా ఉంది. లాక్‌డౌన్‌తో ఆదాయం లేక ఇది 10 శాతానికి చేరనుంది. అప్పులతో ద్రవ్యలోటు 13-14 శాతానికి చేరితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ క్రమంలో రుణాలపై స్పష్టమైన నిర్ణయంతో పారదర్శకంగా ముందుకెళ్లాలి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ మెరుగైన నిర్ణయాలు తీసుకుంది. అయినా..బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇలాగైతే పరిశ్రమలు ఉత్పత్తులు ఆపివేస్తాయి. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతుంది. అందువల్ల ప్రభుత్వమే ముందుకొచ్చి బ్యాంకులకు క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలి.
మనకు మంచి అవకాశమే...
చైనాపై నమ్మకం సడలి అక్కడి నుంచి తరలిపోతున్న విదేశీ కంపెనీలను ఆకర్షించటం మనకు మంచి అవకాశమే. రెండుమూడేళ్లుగా అమెరికా చైనాపై విధించిన పన్నురేట్లతో పలు కంపెనీలు కొరియా, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు తరలిపోయాయి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే పరిశ్రమల పెట్టుబడులను ఆహ్వానించేందుకు మనం సరళతరమైన పారిశ్రామిక విధానాన్ని మరింతగా మెరుగుపరచాలి.