దేశ ఆర్థిక పురోభివృద్ధి గమనాన్ని నిర్ణయించేది కేంద్ర బడ్జెట్. బడ్జెట్ అంటే అన్ని రంగాల్లో ఆశలు, అంచనాలు సహజమే. అయితే ఈ సారి బడ్జెట్.. భిన్నంగా ఉండనుంది. కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన ప్రత్యేక పరిస్థతుల్లో ఈ సారి బడ్జెట్ వస్తుండటమే ఇందుకు కారణం.
ఈ సారి పద్దులో డిమాండ్ పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకుంటారని భారీ అంచనాలు ఉన్నాయి. ఆదాయపు పన్నులో ఊరట కలిగించాలని వేతనజీవులు కోరుతుంటే.. డిమాండ్ పెంచాలని, చిక్కుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని పరిశ్రమలు, సంస్థలు సూచిస్తున్నాయి.
కొవిడ్ మూలంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వివిధ వర్గాల్లో బడ్జెట్ పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వైద్యరంగానికి పెద్దపీట!
బడ్జెట్లో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. కరోనా వల్ల ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, పరిశోధన ఇతరత్రా అంశాల్లో వ్యయం పెంచాల్సిన పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణం. 2022 వరకు జీడీపీలో 3 శాతం వైద్య రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నందున.. ఈ సారి బడ్జెట్ లో ఈ రంగంపై కేటాయింపులు జీడీపీలో 2 నుంచి 2.5 శాతం వరకు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2020-21 కూడా దీనినే సిఫారసు చేసింది.
ఆదాయపు పన్ను తగ్గింపు?
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఉపకరించేలా డిమాండ్ పెంచేందుకు ఆదాయపు పన్నులో మరింత ఊరట కలిగించే నిర్ణయాలు ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు ప్రస్తుతం ఉన్న రూ.50వేల స్థాయి నుంచి పెరుగుతుందని భావిస్తున్నారు.
పెరిగిన వైద్యారోగ్య ఖర్చుల దృష్ట్యా.. సెక్షన్ 80డీ డిడక్షన్స్ పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గృహ రుణాలు, సెక్షన్ 80సీ విషయంలో డిడక్షన్ పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ట్యాక్స్ డిడక్టబుల్ ఇన్ ఫ్రా బాండ్లు ప్రవేశపెట్టొచ్చని కూడా నిపుణులు అంటున్నారు.
- ఇదీ చూడండి:బడ్జెట్లో ఆదాయపు పన్ను రాయితీలు!
వాహన రంగం ఆశలు..
వాహన రంగానికి సంబంధించి ఇప్పటికే స్క్రాప్ పాలసీని కేంద్రం ప్రకటించింది. దీని అమలుపై ప్రభుత్వం ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు వాహన రంగం భావిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వాహన రంగంపై దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలని అనుకుంటోంది.
విద్యుత్ వాహనాలకు అధిక కేటాయింపులు?