అది మార్చి 20. అప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 194. మరణాలు 4. అలాంటి సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది నరేంద్రమోదీ ప్రభుత్వం. కరోనాపై పోరాటంలో సామాన్యుల అస్త్రాలైన ఫేస్ మాస్క్, శానిటైజర్‌ను నిత్యవసరాల జాబితాలో చేర్చింది. ప్రజాహితం కోసం తీసుకున్న ఈ నిర్ణయం గురించి అప్పట్లో ట్విట్టర్లో చాలా గర్వంగా ప్రకటించారు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్.
నాలుగు నెలలైనా గడవలేదు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు ఎనిమిదిన్నర లక్షలు. మృతుల సంఖ్య సుమారు 23 వేలు. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రివర్స్ గేర్ వేసింది కేంద్రం. ఎందుకిలా? మాస్క్‌లు, శానిటైజర్లను నిత్యవసరాల జాబితా నుంచి ఎందుకు తొలగించింది? ఇందుకు కేంద్రం చెబుతున్న కారణాలు ఏమిటి? నిపుణుల ఏమంటున్నారు?
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...
కరోనా వైరస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు 100 మిల్లీలీటర్ల శానిటైజర్ ధర రూ.50, రెండు లేయర్ల మాస్క్ ధర రూ.8, మూడు లేయర్ల మాస్క్ ధర రూ.10 దాటొద్దని వాటి తయారీదారులకు స్పష్టంచేసింది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ నిర్ణయంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు అంటువ్యాదుల చట్టం 1897 కింద.. జన సంచారంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ నిబంధనలు పాటించని వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నాయి. ఇందుకోసం మాస్క్‌ల ధరలు నియంత్రించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.
అయితే ఇటీవల లభ్యతకు కొరత లేదనే కారణంతో నిత్యవసరాల జాబితా నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ అంశంపై ఇప్పుడు విపక్షాలు, నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తోంది.
విపక్షాలకు కొత్త అస్త్రం
మాస్క్‌లు, శానిటైజర్ సహా మరికొన్ని తప్పనిసరి వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి తొలగిచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పట్లో ప్రభుత్వాన్ని పదేపదే డిమాండ్ చేశారు. అయితే మోదీ ప్రభుత్వం.. ఏకంగా వాటి ధరలపై పరిమితి విధించి విపక్షాలు విమర్శించేందుకు వీలు లేకుండా చేసింది. కానీ ఇప్పుడు నిత్యవసరాల జాబితా నుంచి శానిటైజర్లను, మాస్క్‌లను తొలగించడం వల్ల... మళ్లీ ప్రత్యర్థులు చెలరేగేందుకు స్వయంగా అవకాశం కల్పించినట్లయింది.