కరోనా లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది జీఎస్టీ మండలి. రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న విక్రయదారులు ఆలస్యంగా చెల్లించే పన్నుమొత్తాలపై వడ్డీని 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల పన్ను చెల్లింపులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టంచేసింది.
మే, జూన్ మాసాల జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సెప్టెంబర్ వరకు గడువు పొడిగిస్తున్నట్లు జీఎస్టీ మండలి సమావేశం తర్వాత వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
వారికి ఆలస్య రుసుములు లేవు..
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేరకు 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య ఎలాంటి బకాయిలు లేకుండా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారిపై ఆలస్య రుసుము విధించరు. పన్ను బకాయిలు ఉన్నవారు, 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి గరిష్ఠ ఆలస్య రుసుముగా రూ. 500 వసూలు చేయనున్నారు. ఈ మొత్తం 2020 జులై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య రిటర్నులు దాఖలు చేసే వారి నుంచి వసూలు చేస్తారు.