తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం - ఆర్థిక మంత్రి

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఎగుమతులు, స్థిరాస్తి రంగాలను ప్రోత్సహించేలా రూ.70 వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది.

నిర్మలాసీతారామన్​

By

Published : Sep 14, 2019, 5:22 PM IST

Updated : Sep 30, 2019, 2:36 PM IST

రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే దిశగా కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. గతుకుల బాటలో పయనిస్తున్న ప్రగతి రథాన్ని తిరిగి గాడినపెట్టే లక్ష్యంతో వరుసగా మూడో వారం కీలక సంస్కరణలు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన ఎగుమతులు, స్థిరాస్తి రంగానికి ఊతమివ్వడంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించింది.

గాడిన పడుతోంది...

ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోందని చెబుతూ వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టంచేశారు. పారిశ్రామికోత్పత్తి తిరిగి పుంజుకుంటందనేందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఎగుమతులు గతేడాది ఆగస్టుతో పోల్చితే 6.06 శాతం క్షీణించిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి.

"ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రధానంగా ఆరు కొత్త పథకాలను తీసుకొస్తున్నాం. అందులో మొదటిది ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకం (ఆర్​ఓడీటీఈపీ). ఈ పథకం గతంలోని ఎం​ఈఐఎస్​ స్థానంలో అమలు కానుంది. రెండోది జీఎస్టీలో ఇన్​పుట్​ టాక్స్​ క్రెడిట్ల (ఐటీసీ) కోసం పూర్తిగా ఆటోమేటెడ్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ విధానం ఈనెల చివరికల్లా ప్రారంభిస్తాం. "

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

స్థిరాస్తి రంగం..

ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న వేళ గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్​పీఏలు, ఎన్​సీఎల్​టీ ప్రొసీడింగ్స్​ ప్రకారం దివాలా తీసినవి ఈ ఉద్దీపన ప్యాకేజీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు సమకూర్చుతుందన్నారు నిర్మల. దాదాపు అదే మొత్తాన్ని బయటి పెట్టుబడిదారుల నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఉద్దీపన చర్యలు...

  • ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకాన్ని(ఆర్​ఓడీటీఈపీ) గతంలోని ఎంఈఐఎస్​ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం 2020 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. సుమారు రూ.50 వేల కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నారు.
  • ఇన్​పుడ్​ టాక్స్​ క్రెడిట్​లో ఆటోమేటిక్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్​ వ్యవస్థను తీసుకురానున్నారు. ఈ పథకం ఈనెల చివరి కల్లా అందుబాటులోకి వస్తుంది. ఐటీసీ రీఫండ్​లో వేగం పెంచే దిశగా చర్యలు చేపట్టారు.
  • ఎక్స్​పోర్ట్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ (ఈసీజీసీ) ద్వారా బీమా పరిమితి విస్తరణ. బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ మొత్తంలో బీమా సౌకర్యం ఉంటుంది. ఏటా సుమారు రూ.1700 కోట్ల వ్యయం అంచనా. ప్రధానంగా ఎంఎస్​ఎంఈలకు లబ్ధి చేకూరనుంది.
  • ఎగుమతులను ప్రోత్సహించేందుకు సవరించిన ప్రాధాన్య రంగ రుణ నిబంధనలు (పీఎస్​ఎల్​) తీసుకొచ్చారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో వీటి పరిశీలన ఉండనుంది. ఈ పథకం ద్వారా అధనంగా మరో రూ.36 వేల కోట్ల నిధులు రుణాల మంజూరు కోసం అందుబాటులోకి రానున్నాయి.
  • ఎగుమతుల సమయంలో వేగం పెంచేందుకు అన్ని రకాల అనుమతులు ఆన్​లైన్​ ద్వారా ఇవ్వనున్నారు. పోర్ట్​, విమానాశ్రయం, కస్టమ్స్​, ఇతర అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Last Updated : Sep 30, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details