భారత అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సంక్షోభమూ అడ్డుకోలేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో పేదల కోసం ప్రభుత్వం భారీ బ్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేందుకు ఈ భారీ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సెషన్లో.. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
'భారత ప్రగతి రథాన్ని ఏదీ అడ్డుకోలేదు'
కరోనా మహమ్మారి సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సెషన్లో ఆయన వివరించారు.
మత్స్యుకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు కోవింద్. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించినట్లు వెల్లడించారు.
దేశ రైతుల ప్రయోజనాలకే మూడు నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. ఈ చట్టాలు రైతుల హక్కులను హరించవని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అనుగుణంగా మద్దతు ధరలు పెంచుతున్నట్లు వివరించారు. ఇంకా చిన్న, సన్నకారు రైతులపై దృష్టిసారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.13 వేల కోట్లు బదిలీ చేశామని తెలిపారు.