కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు స్వయంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారంతో సంబంధం కలిగి ఉండడం, ఆయనే ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి కావడం కూడా... రాజకీయ దుమారానికి దారితీసింది.
జులై 5న గల్ఫ్ నుంచి కేరళ తిరువనంతపురం విమానాశ్రయానికి బంగారం అక్రమ రవాణా చేసిన నలుగురు నిందితులను కస్టమ్స్ అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుపై కస్టమ్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఆదాయ పన్నుశాఖలు మొదట దర్యాప్తు ప్రారంభించాయి. తరువాత ఈ కేసుపై ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. నిందితులపై అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.
ఉగ్రవాదులతో సంబంధం
ఈ కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందుని ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
ఎన్నో ప్రశ్నలు?
ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశానికి... గల్ఫ్ దేశాల నుంచే ఎందుకు ఎక్కువగా బంగారం అక్రమ రవాణా జరుగుతోంది? ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ బంగారం స్మగ్లింగ్ కోసం కేరళ రాష్ట్రాన్నే ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారు? కరెన్సీ సహా ఇంకా విలువైన లోహాలు ఉండగా.. కేవలం బంగారాన్నే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?
సామాన్యుల మెదడును తొలుస్తున్న ఇలాంటి ప్రశ్నలకు... సమాధానం ఇచ్చారు ఓ సీనియర్ ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్(ఐఆర్ఎస్). అయితే ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
*ప్రశ్న: గల్ఫ్ దేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?
జవాబు: 1990వరకు, మన దేశ చట్టం ప్రకారం, బంగారం అక్రమ రవాణాను క్రిమినల్ నేరం కింద పరిగణించేవారు. అయితే 1990 జూన్ 6న.. 'గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1968'ను పార్లమెంట్ రద్దు చేసింది. అలాగే 1990 చట్టం ప్రకారం, 6 నెలలు విదేశాల్లో నివసించిన భారతీయులు.. స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు 5 కిలోగ్రాముల బంగారం వరకు తీసుకురావడానికి అవకాశం కల్పించింది.
దీని ప్రకారం, విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఒక గ్రాము బంగారానికి కట్టాల్సిన డ్యూటీ ఫీజు కేవలం రూ.22 మాత్రమే. అంటే, సాంకేతికంగా సావరిన్ గోల్డ్‌పై రూ.176 డ్యూటీ చెల్లించి.. ఎవరైనా విదేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకురావచ్చు. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు.
ఆ రోజుల్లో స్మగ్లర్లు.. గల్ఫ్ నుంచి వచ్చే కొంతమందిని ప్రలోభపెట్టి, వారికి విమానం టికెట్లు కొనిచ్చి, బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చేలా చేసేవారు. అలా గల్ఫ్ నుంచి వచ్చిన వారు తాము తెచ్చిన బంగారానికి విమానాశ్రయంలోనే డ్యూటీ కట్టేసేవారు. వారు బయటకు రాగానే... స్మగ్లర్లు ఆ బంగారాన్ని తీసుకునేవారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్కో విమానంలో సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇలా బంగారాన్ని అక్రమంగా తరలించేవారు. ఆదాయపన్ను శాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థలు చేసిన దర్యాప్తులో.. గల్ఫ్ నుంచి బంగారం తెచ్చేవారి ఆర్థిక పరిస్థితి తీవ్ర దుర్భరంగా ఉన్నట్లు తేలింది. వారు కనీసం ఒక్క బంగారం బిస్కెట్‌ను కూడా కొనే స్థితిలో లేరని స్పష్టం అయ్యింది. దీని ద్వారా భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... ఇలా గల్ఫ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తెచ్చినవారికి.... నిజంగా ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో.. అది చివరికి ఎవరికి చేరుతుందో... ఏమీ తెలియదు.
ఇలా ఈ దందా 2012 వరకు కొనసాగింది. అయితే 2012లో బంగారం దిగుమతి సుంకాన్ని... భారత్ మార్కెట్ విలువలో 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో మరోసారి ఈ సంకాన్ని 12.5 శాతానికి పెంచింది. ఇది బంగారం అక్రమ రవాణా మరింత పెరిగేలా చేసింది.
*ప్రశ్న: బంగారాన్ని మాత్రమే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?