తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా క్షీణించిన విదేశీ మారకపు నిల్వలు - Forex reserves fall by USD 12 bn : RBI data

భారత్​లో విదేశీ మారకపు నిల్వలు భారీగా క్షీణించాయి. మార్చి 20 నాటికి దాదాపు 12 బిలియన్ డాలర్లు మేర తగ్గిపోయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. బంగారం సహా ఐఎంఎఫ్​ వద్ద దేశీయ నిల్వలు సైతం తగ్గుముఖం పట్టాయి.

Forex reserves fall by USD 12 bn : RBI data
విదేశీ మారక నిల్వలు

By

Published : Mar 28, 2020, 7:15 AM IST

దేశంలో విదేశీ మారకపు(ఫారెక్స్) నిల్వలు భారీగా క్షీణించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది. మార్చి 20 నాటికి 11.98 బిలియన్ డాలర్లు మేర క్షీణించి.. 469.909 బిలియన్ డాలర్లకు చేరినట్లు స్పష్టం చేసింది. రూపాయి మారకపు విలువ తగ్గిపోతున్న క్రమంలో దానిని అడ్డుకునేందుకు మార్కెట్లోకి నిరంతరం డాలర్​ను సరఫరా చేస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకున్న నేపథ్యంలో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి రూ.76.15కు పడిపోయింది.

6 నెలల్లో తొలిసారి..

అంతకుముందు వారం సైతం విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. 5.346 బిలియన్​ డాలర్లు పతనమై 481.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఆరు నెలల కాలంలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. మార్చి 6న ఈ నిల్వలు జీవిత కాల గరిష్ఠాన్ని(487.23) నమోదు చేశాయి.

బంగారం నిల్వలు సైతం..

గత కొద్ది వారాలుగా పెరుగుదల నమోదు చేసిన బంగారం నిల్వలు సైతం తగ్గుముఖం పట్టాయి. 1.610 బిలియన్ డాలర్ల మేర క్షీణించి.. 27.856 బిలియన్​ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్​బీఐ తెలిపింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థలో ప్రత్యేక ఉపసంహరణ హక్కులు సైతం 40 మిలియన్ డాలర్లు తగ్గి.. 1.409 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్​ వద్ద దేశీయ నిల్వలు 77 మిలియన్లు క్షీణించి.. 3.542 బిలియన్ డాలర్లకు చేరాయి.

ABOUT THE AUTHOR

...view details