పత్తి అనేది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రధానమైన పంటగా ఉంది. అలాంటి పంట ఉత్పత్తి, ఎగుమతులు భారత్‌లో పడిపోతున్నాయి. నీటి ఎద్దడి వల్ల 70 నుంచి 80 శాతం ప్రాంతాల్లో మూడు, నాలుగో సారి పత్తిని సేకరించకుండానే రైతులు మొక్కలను తొలగించారు.
గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లు పత్తిని పండించే రాష్ట్రాల్లో ప్రధానమైనవి. ఒడిశా, తమిళనాడు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అంచనాను తగ్గించింది కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఏఐ).
ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి గుజరాత్లో 1 లక్ష బేల్స్, మహారాష్ట్రలో 80వేల బేల్స్, తెలంగాణలో 4లక్షల బేల్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1లక్ష బేల్స్, కర్ణాటకలో 75వేల బేల్స్ల ఉత్పత్తి తగ్గిపోనున్నట్లు అంచనా వేసింది సీఏఐ.
ఇదీ సంగతి...
2018-19లో పత్తి ఉత్పత్తి 31.88 శాతం తగ్గి 47 లక్షల బేల్స్గా నమోదైంది. ఇది క్రితం ఏడాదిలో 69లక్షల బేల్స్గా ఉంది. అల్ప ఉత్పత్తి, రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవటం ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.