ఆదాయ పన్ను చెల్లించేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది. చెల్లింపుదార్లు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంటి అద్దె వివరాలు
ఉద్యోగులు తమ వేతనాల్లో భాగంగా ఇంటి అద్దెనూ అలవెన్సుల కింద పొందుతారు. అయితే ఆదాయ పన్ను చెల్లింపులో మినహాయింపు పొందాలంటే పన్ను చెల్లింపుదారు తప్పని సరిగా ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లు రసీదులు దగ్గరపెట్టుకోవాలి.
ఒకవేళ ఏడాదికి రూ. లక్షకు మించి ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లయితే... ఆ ఇంటి యజమాని పాన్‌కార్డు వివరాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే... స్థిరాస్తులను అద్దెకివ్వడం ద్వారా ఆర్జించే మొత్తం పన్ను సహిత ఆదాయ పరిధిలోకి వస్తుందని ఆదాయ పన్ను చట్టాలు చెబుతున్నాయి.
బీమా వివరాలు
ఆదాయ పన్ను చెల్లింపుల్లో మినహాయింపు పొందేందుకు మరో మార్గం బీమా పాలసీలు కొనుగోలు చేయడం. ఇందుకు జీవిత బీమా సహా ఆరోగ్య బీమాల డాక్యుమెంట్లు సమర్పించాలి.
ఇందులో పన్ను చెల్లింపుదారు తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు సంబంధించిన ప్రీమియం వివరాలు సమర్పించి పన్ను మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు.