ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా బదిలీ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా బదిలీకి దరఖాస్తు అవసరం లేకుండానే బదిలీ పూర్తయ్యేలా స్వయంచోదిత యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పీఎఫ్ ఖాతా బదిలీ ఇక సులభం - స్వయంచోదిత విధానం
దరఖాస్తు చేయకుండానే పీఎఫ్ ఖాతాను బదిలీచేసే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వచ్చే ఆర్ఖిక సంవత్సరంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఆటోమేషన్(స్వయంచోదిత) విధానం పనితీరును పరీక్షిస్తోంది ప్రభుత్వం.
ఈపీఎఫ్ఓ యంత్రాంగాన్ని పూర్తిగా కాగిత రహింతంగా మార్చే దిశగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 80 శాతం వరకు కార్యకలాపాలు కాగిత రహితంగా జరుగుతున్నాయన్నారు. ప్రతీ ఏటా 8 లక్షల పీఎఫ్ ఖాతాల బదిలీకి దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. పూర్తి కాగిత రహితంగా సంస్థ రూపొందాలంటే.. పీఎఫ్ ఖాతా బదిలీకి దరఖాస్తు ప్రక్రియ అవసరం లేకుండా చేయడం ప్రధానమైన అంశమని పేర్కొన్నారు.