ఏళ్ల తరబడి వృద్ధితో సాగుతున్న అర్థిక వ్యవస్థలు, కొవిడ్ ప్రభావంతో కొన్ని వారాల్లోనే తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్ వల్ల విక్రయశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతబడటమే ఇందుకు కారణం. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్- జూన్‌లో స్పెయిన్ ఆర్థికవ్యవస్థ 18.5 శాతం క్షీణించింది. ఫ్రాన్స్ 14 శాతం, ఇటలీ 12.4 శాతం క్షీణతను నమోదు చేశాయి.
- స్పెయిన్‌లో వృద్ధి గణాంకాలు నమోదు చేసినప్పటి నుంచి ఇంతగా వృద్ధి క్షీణించడం ఇదే తొలిసారి. పరిస్థితిని మెరుగు పరచేందుకు ఏం చేయాలనే విషయమై స్పెయిన్ ప్రధాని ప్రాంతీయ నేతలతో సమావేశమవుతున్నారు. మార్చి మధ్య నుంచి జూన్ 21 వరకు స్పెయిన్‌లో లాక్‌డౌన్ అమలైంది.
- ఫ్రాన్స్‌లో 2 నెలల లాక్‌డౌన్ ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయింది. ఎన్నడూ లేనంత మాంద్యాన్ని ఎదుర్కొంటున్న దేశంలో వరుసగా మూడో త్రైమాసికంలోనూ పరిస్థితి క్లిష్టంగానే ఉంది. కొవిడ్ తీవ్రత పెరుగుతున్నందున మరోసారి లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నారు. ఇందువల్ల ఉద్యోగాలు, పరిశ్రమలపై అధిక ప్రభావం పడుతోంది. 2010-19 సంవత్సరాల జీడీపీ వృద్ధి అంతా 5 నెలల్లో హరించుకు పోయిందని ముఖ్య ఆర్థికవేత్త ఓస్టాల్డ్ పేర్కొన్నారు.
- ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ జీడీపీ 10.1 శాతం క్షీణించింది. 1970 నుంచి గణాంకాలు నమోదు చేస్తుండగా, ఇదే అత్యంత దుర్భర స్థితి.