పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతూ నకిలీ జీఎస్టీ బిల్లులు సమర్పించే వారి ఆటలు ఎంతో కాలం సాగబోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఇటీవల దేశవ్యాప్తంగా తనిఖీలు జరిపి 90 మందికి పైగా అరెస్టు చేశారని, వారిలో ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ముగ్గురు ఉన్నారని తెలిపారు.
115 కంపెనీలను సృష్టించి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు అపర మేధావులను అరెస్టు చేసి భారీ సంఖ్యలో వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేటి డిజిటల్ యుగంలో అక్రమార్కులను వెతికి పట్టుకోవటం అధికారులకు పెద్ద కష్టమేమీకాబోదన్న విషయం ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయని తెలిపారు. 'ప్రతిరోజూ నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు మా దృష్టికి వస్తున్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థకు, పన్ను సంస్థలకు, నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులకు మంచిది కాదు'అని ఛార్టర్డ్ అకౌంటెంట్ ప్రీతమ్ మహురె చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయాన్ని తీసుకుంటారని, వివిధ విభాగాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని హైదరాబాద్కు చెందిన జీఎస్టీ నిపుణుడు భోగవల్లి మల్లిఖార్జున గుప్తా 'ఈటీవీ భారత్'కు తెలిపారు.