కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వాటిని ఆదుకునేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించింది కేంద్రం. అన్ని రంగాలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు త్వరలోనే సమగ్ర ప్యాకేజీకి రూపుదిద్దుతున్న కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పలు ప్రకటనలు చేసింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులు, వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు ఊరటనిస్తూ పలు ఉద్దీపనలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్ను చెల్లింపు గడువును 2020 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ రిటర్నుల గడువును కూడా జూన్ 30వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
"2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును 2020 జూన్ 30 వరకు పొడిగించాం. రిటర్నుల దాఖలులో ఆలస్యం అయితే చెల్లించాల్సిన రుసుము గడువును జూన్ 30 వరకు పొడిగించాం. ఆలస్యంపై వడ్డీని 12 నుంచి 9శాతం తగ్గించాం. అయితే ఇది కచ్చితంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. టి.డి.ఎస్ దాఖలు గడువును పొడిగించకుండా ఆలస్యంపై వడ్డీని 9శాతానికి తగ్గించాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి