తెలంగాణ

telangana

ETV Bharat / business

వజ్రాల వ్యాపారంపై కరోనా పడగ-రూ.8వేల కోట్ల నష్టం!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ భారత వాణిజ్యంపైనా పెను ప్రభావం చూపిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా రానున్న రెండు నెలల్లో సూరత్‌ వజ్రాల పరిశ్రమకు దాదాపు రూ. 8,000 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంకాంగ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

DIAMOND
వజ్రాల వ్యాపారంపై కరోనా పడగ

By

Published : Feb 5, 2020, 8:31 PM IST

Updated : Feb 29, 2020, 7:43 AM IST

చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌.. హాంకాంగ్‌కు వ్యాపించింది. ఈ వైరస్‌ కారణంగా హాంగ్‌కాంగ్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. మార్చి మొదటివారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు అధికారులు. వైరస్‌ ప్రభావంతో హాంకాంగ్‌లో వ్యాపారాలు నెమ్మదించాయి. ఈ ప్రభావం సూరత్‌ వజ్రాల పరిశ్రమపై పడింది. సూరత్‌ వజ్రాలకు హాంకాంగ్ ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండటమే ఇందుకు కారణం.

వ్యాపారం విలువ..

సూరత్ నుంచి ఏటా దాదాపు రూ.50,000 కోట్ల విలువైన పాలిష్‌డ్‌ వజ్రాలు హాంకాంగ్‌కు ఎగుమతి అవుతుంటాయి. సూరత్‌ నుంచి ఎగుమతయ్యే మొత్తం వజ్రాల విలువలో ఇది 37శాతానికి సమానం.

వ్యాపారుల తిరుగు ముఖం..

కరోనా వైరస్‌ భయంతో హాంకాంగ్‌లో నెల రోజుల ఎమర్జెనీ ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడి గుజరాత్‌ వజ్ర వ్యాపారులు తిరుగుముఖం పట్టారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది సూరత్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రత్నాలు & ఆభరణాల ఎగుమతో ప్రోత్సాహక మండలి తెలిపింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు రూ.8,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.

వచ్చే నెలలో హాంకాంగ్‌లో అంతర్జాతీయ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ ప్రదర్శనను రద్దు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది కూడా సూరత్‌ వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

వ్యాపారుల ఆవేదన..

సూరత్‌లో చేసిన పాలిష్డ్‌ వజ్రాలు, ఆభరణాలు హాంకాంగ్‌ ద్వారానే ప్రపంచమంతటికీ వెళ్తాయని, ఐతే అత్యయిక స్థితి వలన హాంకాంగ్‌లో వ్యాపారాలను మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు. జువెల్లరీ ఎగ్జిబిషన్‌ రద్దయితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇదీ చూడండి:దిగొచ్చిన పసిడి.. రూ.41 వేల దిగువకు 10 గ్రాముల ధర

Last Updated : Feb 29, 2020, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details