వచ్చే ఐదేళ్లలో (2024 కల్లా) మన దేశంలో అదనంగా 100 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ దిశగా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. 2025 కల్లా మౌలిక సదుపాయాల అవసరాలపై గతవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
చిన్న పట్టణాలు, గ్రామాలను అనుసంధానం చేస్తూ 1000 కొత్త మార్గాల ఏర్పాటు, విమానాల అద్దెకు రుణాలిచ్చే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారని తెలిపాయి. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా పెట్టుబడులకు భారత్‌ను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చారు. విమానాల అభివృద్ధి ప్రణాళిక అమలును కూడా వేగవంతం చేసేందుకు కూడా భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
2035లోపు రెట్టింపు విమానాశ్రయాలే లక్ష్యం
2035 కల్లా 450 వాణిజ్య విమానాశ్రయాలు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018 చివరినాటికి ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అలాగే వచ్చే ఐదేళ్లలో విమానాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక శిక్షణ పైలట్ల సంఖ్యను ఏడాదికి 600, విమానాల సంఖ్యను 1200 మేర పెంచే ప్రతిపాదన పైనా కసరత్తు చేస్తోంది. మూడేళ్ల క్రితం 450 రన్‌వేల్లో 75 మాత్రమే ఉపయోగానికి వీలుగా ఉండేవి. అయితే ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన సబ్సిడీ పథకం ద్వారా ఈ ఏడాది ప్రారంభం నుంచి 38 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి.
పరిమిత కనెక్టవిటీతో మరో 63 విమానాశ్రయాల్లో విమాన సర్వీసులను నడిపేందుకు కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. మరోవైపు తొలిసారి విమానం ఎక్కాలనే కోరిక ఉన్న మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండటంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌ఏషియా కార్యకలాపాలు లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్‌లోకి అడుగుపెట్టాయి. డ్రోన్ల వినియోగాన్ని కూడా భారత్ ప్రోత్సహించనుంది. ఇందుకుగాను ఈ ఏడాదిలో ఒక విధానాన్ని కూడా ప్రకటిచంఇంది. 2021 కల్లా డ్రోన్ కారిడార్స్ ఏర్పాటుకు కూడా సమాయత్తం అవుతోంది.
ఇదీ చూడండి: పొదుపులో మహిళల రూటే సెపరేటు