జీడీపీలో భారత్ దూసుకెళ్తుందంటున్న అరుణ్‌జైట్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన 108 మంది ఆర్థికవేత్తలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ గణాంకాల్లో రాజకీయ జోక్యం జరుగుతోందని తప్పుడు ప్రచారానికి దిగారని, రాజకీయంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జైట్లీ. ప్రభుత్వ గణాంకాల్లో రాజకీయ జోక్యం జరుగుతోందని ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు జీన్ డ్రీజ్, ఎమిలీ బ్రెజా, సతీశ్ దేశ్‌పాండే, ఎస్తర్ డఫ్లో, జయతి ఘోష్ గతవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జాతీయ గణాంకాల సంస్థ విడుదల చేసిన జీడీపీ, నిరుద్యోగ శాతాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరముందన్నారు. సంస్థాగత స్వేచ్ఛ, గణాంక సంస్థల సమగ్రతను పునరుద్ధరించాల్సిన అవసరముందని తెలిపారు.
జీడీపీలో భారత్ దూసుకెళ్తుందని 131 మంది ఛార్టర్డ్ అకౌంటెంట్లు ఇచ్చిన నివేదికను నొక్కి చెబుతూ ఆర్థిక వేత్తల ఆరోపణలను జైట్లీ కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక విజయాలను ఉదహరిస్తూ విశదీకరించారు. ప్రభుత్వంతో కేంద్ర గణాంకాల సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, స్వతంత్రంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
"మనం గణాంకాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాం. విపక్షాల్లో ఏ విషయాన్నైనా రాజకీయం చేయగలిగే సమర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలను మాత్రం అర్థం చేసుకోరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏ స్థానంలో ఉందో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా 7.5 సగటుతో వృద్ధి రేటు పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటును నియంత్రించగలిగాం. జీడీపీలో అప్పుల శాతం తగ్గి ప్రభుత్వ ఖాతా మిగులులో పురోగతి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంటే ఉద్యోగాలు ఎలా తగ్గుతాయి? "
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి