ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. సంస్థ ఐపీఓకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఇవే కావడం గమనార్హం.
2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య రూ.356 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు జొమాటో ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నష్టం రూ.99.8 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం మాత్రం రికార్డు స్థాయిలో రూ.916 కోట్లకు పెరిగినట్లు తెలిపింది జొమాటో. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.283.5 కోట్లుగా వెల్లడించింది. ఏప్రిల్లో కొవిడ్ రెండో దశ ప్రారంభమైనప్పటికీ.. ఫుడ్ డెలివరీ సేవలకు పెరిగిన డిమాండ్ వల్ల ఈ స్థాయిలో ఆదాయం గడించినట్లు వివరించింది.
తమ డెలివరీ భాగస్వాములు వారానికి కనీసం 40 గంటలు పని చేస్తున్నారని జొమాటో తెలిపింది. వారంతా నెలకు సగటున రూ.27 వేల వరకు సంపాదిస్తున్నట్లు వివరించింది. జులై నాటికి కంపెనీ డెలివరీ భాగస్వాముల సంఖ్య 310,000గా ఉన్నట్లు పేర్కొంది.