ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు భారీ స్పందన వస్తోంది. ఐపీఓ బుధవారం ప్రారంభమవగా.. కొన్ని గంటల్లోనే 36 శాతం సబ్స్క్రిప్షన్లను సాధించింది. మొత్తం 71.92 కోట్ల షేర్లు ఇష్యూకు ఉంచగా.. 26.10 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్ మార్కెట్ల వద్ద లభ్యమైన డేటాలో వెల్లడైంది.
వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లకు మొత్తం 12.95 కోట్ల షేర్లు రిజర్వు చేయగా.. 1.91 రెట్ల బిడ్లు అధికంగా దాఖలైనట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 1:30 వరకు 24.76 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా పేర్కొంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకోసం రిజర్వు చేసిన వాటా కన్నా 7 శాతం అధికంగా బిడ్లు వచ్చినట్లు వెల్లడైంది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచీ భారీగా బిడ్లు..
ఐపీఓకు ముందు రోజు (జూన్ 13) నాటికి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35 రెట్లు ఎక్కువ బిడ్లు పొందింది జొమాటో. ఒక్కో షేరుకు రూ.72-76గా ధర నిర్ణయించారు. ప్రారంభ వాటా అమ్మకం కంటే ముందు 186 యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ.4,196 కోట్లకు పైగా వసూలు చేసినట్లు జొమాటో తెలిపింది. లావాదేవీల పరిమాణాన్ని రూ.4,196.51 కోట్లకు కలిపి యాంకర్ ఇన్వెస్టర్లకు 55,21,73,505 ఈక్విటీ షేర్లను కేటాయించాలని నిర్ణయించినట్లు బీఎస్ఈ సర్క్యులర్‌లో తెలిపింది.