తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ బీమా ఏజెంట్​కు లైసెన్స్​ ఉందా?

బీమా ఏదైనా అందులో మధ్యవర్తుల ప్రమేయం తప్పని సరిగా ఉంటుంది. అయితే బీమా ఏజెంటుగా ఉన్న వారికి ఉండాల్సిన అర్హతలేమిటి.. బీమా తీసుకునే ముందు మధ్యవర్తి దగ్గర తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక కథనం మీకోసం..

మీ బీమా ఏజెంట్​కు లైసెన్స్​ ఉందా?

By

Published : Jun 22, 2019, 2:35 PM IST

Updated : Jun 22, 2019, 5:36 PM IST

బీమా కొనుగోలు ద‌గ్గ‌ర నుంచి పునరుద్ధరణ, క్లెయిమ్ చేసే వరకు బీమాదారు, బీమా కంపెనీతో పాటు మరో వ్యక్తి కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటారు. వారే బీమా మధ్యవర్తులు(ఏజెంట్లు). బీమా కంపెనీకి, బీమా తీసుకునే వ్యక్తికి అనుసంధానంగా వ్యవహరించేవారినే మధ్యవర్తులు అంటారు.

అయితే మధ్యవర్తులుగా ఉండేందుకు.. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) ప్రత్యేకంగా లైసెన్సు జారీచేస్తుంది. సాధారణంగా బీమా ఏజెంట్లకు, కార్పొరేట్‌ బీమా ఏజెంట్లకు కూడా ఐఆర్‌డీఏ లైసెన్సులు ఇస్తుంది. వీరందరికీ ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఐఆర్‌డీఏ రూపొందించింది. అలాంటి వారి వద్దనే బీమాను తీసుకోవడం సురక్షితం.. మరి బీమా తీసుకునే ముందు మీ ఏజెంట్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలపై ఓ ప్రత్యేక కథనం.

లైసెన్సు క‌లిగి ఉన్నారా?

మధ్యవర్తులు ఐఆర్‌డీఏ జారీచేసే లైసెన్సు కలిగి ఉండి బీమా వ్యాపారం చేసేందుకు అర్హత కలిగి ఉన్నారన్న విషయాన్ని బీమా కొనుగోలుకు ముందే తెలుసుకోవాలి.

పాలసీలపై అవగాహన ఉందా?

  • మధ్యవర్తికి బీమా పాలసీలపై పూర్తి అవగాహన ఉందో లేదో నిర్ధరించుకోవాలి. ఎందుకంటే అలాంటి ఏజెంటు మాత్రమే మీ ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని మీకు సరైన పాలసీని అందించగలరు.
  • బీమా ఏజెంటు వివరించే పాలసీ నియమ నిబంధనలను సమగ్రంగా అర్థంచేసుకొని... సందేహాలేమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోవాలి.
  • పాలసీ దరఖాస్తు దస్త్రం స్వయంగా నింపాలి. ఖాళీ ఫారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయరాదు.
  • సాధారణంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల నియమ నిబంధనలు నచ్చకపోతే మూడేళ్ల వరకూ పాలసీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రీమియం చెల్లించే ముందు ఇవి తెలుసుకోండి

మీ ఆదాయంలో ప్రీమియానికి వెచ్చించగలిగే పాలసీనే తీసుకోవాలి. ఎక్కువ మొత్తం ప్రీమియం ఉండే పాలసీని తీసుకొని తర్వాత కట్టలేక ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తపడాలి. ఏజెంటు ద్వారా ప్రీమియం చెల్లించేటప్పుడు సదరు బీమా కంపెనీ ఆ ఏజెంటుకు ప్రీమియం తీసుకునే అధికారం ఇచ్చిందో లేదో చూసుకోవాలి.

ఒకవేళ ఏజెంటుకు ప్రీమియం సొమ్ము ఇస్తే దానికి తగిన రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. చెల్లించిన ప్రీమియం పైకం లేదా చెక్కు బీమా కంపెనీకి అందిందో లేదో తెలుసుకోవాలి.

మనం తీసుకునే పాలసీకి సంబంధించిన బ్రోచర్‌ను... ఏజెంటును అడిగి తీసుకోవాలి. కవరేజీలో రాని అంశాలు, మినహాయింపులేమైనా ఉంటే ముందే తెలుసుకొని ఉండడం మంచిది.

పాలసీ తీసుకునేటప్పుడు చేసే చెల్లింపులతో పాటు పాలసీని స్వాధీనపర్చుకునే వేళ, క్లెయిమ్​ చేసుకునేటప్పుడు ఎలాంటి చెల్లింపులు జరపాలో తెలుసుకోవడం ముఖ్యం.

క్లెయిమ్​ పరిష్కారాలు

క్లెయిమ్​ చేసుకునేటప్పుడు సమర్పించాల్సిన పత్రాలను, వ్యవహరించాల్సిన పద్ధతులను ఏజెంటును అడిగి తెలుసుకోవాలి. కొన్నిసార్లు బీమా కంపెనీలకే కాకుండా వేరే ఏజెన్సీలకు క్లెయిమ్​ విషయాలను తెలపాల్సి ఉంటుంది. అలాంటి వాటి గురించి ఏమేం చేయాల్సి ఉంటుందో ఏజెంటు ద్వారా తెలుసుకోవాలి. సమయానికి సేవ‌లు అందుబాటులో ఉంటాయో లేదో కనుక్కోవాలి.

ఇదీ చూడండి: 'రాష్ట్రాలు కలిసివస్తేనే ఆర్థిక పురోగతి'

Last Updated : Jun 22, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details