బంగారం, వెండి.. రెండూ విలువైన లోహాలే. శుభకార్యాల్లోనూ ఆయా లోహాలతో చేసిన ఆభరణాలకు అంతే ప్రాముఖ్యత ఉంది. అయితే పుత్తడితో పోలిస్తే వెండికి కాస్త విలువ తక్కువ. అందుకే బంగారానికి పేద సోదరుడు, పేదవారి బంగారం అని వెండిని పిలుస్తుంటారు. అయితే అందరికీ అందుబాటులో ఉండే వెండి ధర.. గత వారం రోజుల్లోనే భారీగా పెరిగింది. తాత్కాలికమే అయినప్పటికీ.. బంగారం వెలను మించిపోయింది.
వారం రోజుల్లో కిలో వెండి రూ.9000 (17.5శాతం) పెరిగింది. ఈ సంవత్సరం మార్చితో పోల్చితే ప్రస్తుత ధరలు 70 శాతం ఎక్కువ. ఫ్యూచర్స్ మార్కెట్‌లో గురువారం నాడు కిలో వెండి ధర రూ. 62,400గా నమోదైంది. ఇది 9 సంవత్సరాల గరిష్ఠంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ ఔన్స్ వెండి ధర 22.79 డాలర్లకు పెరిగింది.
పారిశ్రామిక అవసరాలే కారణం…
వెండి ప్రీమియం లోహం. పరిశ్రమల్లోనూ దీని వాడకం ఎక్కువే. ఈ రెండు కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరల తీరులోనే వెండి ధరలు కూడా మొదట పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.50,700 చేరింది. ఇది పసిడి ధరల్లోనే జీవితకాల గరిష్ఠం.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఉద్దీపన ప్యాకేజీపై అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా వెండి ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి.
ఎక్కడ వాడతారంటే..?
వెండిని సౌర ఫలకాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ వంటి వాటిల్లో వినియోగిస్తుంటారు. హరిత ఇంధన, సాంకేతిక, వాహన రంగంలో పెరుగుతున్న విద్యుదీకరణ లాంటి అంశాలు వెండి డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక డిమాండ్ వల్లే మార్కెట్ ధరల్లోనూ భారీ మార్పులు కనిపిస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం 27 ఐరోపా సమాఖ్య దేశాల నేతలు.. ప్రపంచంలో అతిపెద్ద హరిత ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. వాతావరణ మార్పులను నిరోధించేందుకు 630 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్.. తన ఎన్నికల ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హరిత ఇంధనాన్ని ప్రధాన అంశంగా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి రెండు లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
"కరోనాకు టీకా వస్తుందన్న ఆశల మధ్య బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం, అమెరికా డాలర్ బలహీనంగా ఉండటం వంటి ఆంశాలు.. కొన్ని రోజులుగా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్టుబడి పరంగా కూడా వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని ఐషేర్స్ ఈటీఎఫ్ ట్రస్ట్ తెలియజేసింది. ఇందులో వెండికి సంబంధించిన హోల్డింగ్స్ 16,379.08 టన్నులతో రికార్డు స్థాయి గరిష్ఠాన్ని తాకాయి. పెట్టుబడి డిమాండ్ కూడా వెండి ధరల పెరుగుదలకు మరో కారణం."
- ప్రథమేషన్ మాల్యా, కమోడిటీస్ రీసెర్చ్ వింగ్, ఏంజెల్ బ్రోకింగ్