ఆదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) భారీ షాకిచ్చినట్టు తెలిసింది. ఆ సంస్థలో దాదాపు రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్న మూడు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల (ఎఫ్‌పీఐ) ఖాతాలను నిపివేసినట్లు సమాచారం. దీనితో సంస్థ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ దాదాపు 25 శాతం పతనమైంది. గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు భారీగా నష్టపోయి.. లోవర్ సర్క్యూట్‌ను తాకాయి.
కారణాలు ఏమిటి?
ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) ప్రకారం అవసరమైన సమాచారం సమర్పించకపోవడమే ఆయా సంస్థల ఖాతాలు నిలిపివేతకు కారణంగా తెలిసింది. ఖాతాల నిలిపివేత మే 31 కన్నా ముందే జరిగినట్లు సమాచారం.
అయితే నెట్టింట మాత్రం అదానీ షేర్లు పతనమయ్యేందుకు అసలు కారణం వేరేలా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడటంలో ముఖ్య భూమిక పోషించిన మహిళా జర్నలిస్ట్ సుచేత దలాల్ చేసిన ట్వీట్ ఇందుకు కారణమని జోరుగా చర్చ జరుగుతోంది.