ఫేస్‌బుక్, జియోల మధ్య ఒప్పందం గురించి కీలక ప్రకటన చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. వాట్సాప్ ద్వారా కిరాణా సరుకులను రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత విద్యా, హెల్త్ సెక్టార్‌లోకి విస్తరించనున్నట్లు వెల్లడించారు. జియో, ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల ఒప్పందం కుదిరిన తర్వాత కిరాణా సరుకుల రవాణాకు సంబంధిన వీడియోను విడుదల చేశారు ముకేశ్.
" జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. త్వరలోనే జియో మార్ట్ (జియో న్యూ కామర్స్ ప్లాట్‌ఫాం), వాట్సాప్‌ల ద్వారా 3 కోట్ల చిన్న కిరాణాలను డిజిటలైజ్ చేసి పుర్తిగా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ప్రోత్సాహం అందివ్వనున్నాం. దీని ద్వారా మీ సమీపంలోని చిన్న చిన్న కిరాణాల నుంచి రోజు వారి అవసరాలకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవచ్చు. చిన్న వ్యాపారులూ తమ కార్యకలాపాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ సాంకేతికను వినియోగించుకుని కొత్తగా ఉపాధి అవకాశాలు పెంచే వీలు కలగుతుంది. భారత్‌ను అతిపెద్ద డిజిటల్ దేశంగా తీర్చిదిద్దేందుకు మా భాగస్వామ్యం ఉత్ప్రేరకంగా పని చేయనుంది."