తెలంగాణ

telangana

భారత్​లో ఉబర్ బస్సుల రయ్​రయ్​?

By

Published : Oct 23, 2019, 12:54 PM IST

భారత్​లో 'ఉబర్​' సేవల విస్తరణలో భాగంగా పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ ఫీచర్​తో కూడిన బస్సు సేవల యాప్​ను ఇటీవల ఆవిష్కరించింది. దిల్లీ మెట్రో భాగస్వామ్యంతో ఈ సేవలను అందివ్వనుంది ఉబర్. ప్రస్తుతానికి దేశరాజధానికి మాత్రమే పరిమితం చేసిన బస్సు సర్వీసు సేవలను.. వినియోగదారుల స్పందన ఆధారంగా ఇతర నగరాలకు విస్తరించనున్నారు.

ఉబర్​ బస్సు సేవలు

ఆన్​లైన్ క్యాబ్​ సర్వీసుల సంస్థ ఉబర్ భారత్​లో సేవలను విస్తరించాలని భావిస్తోంది. ప్రస్తుతం కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, బోట్‌ విభాగాల్లో మాత్రమే సేవలందిస్తున్న ఉబర్‌ ఇప్పుడు బస్సు సర్వీసుల్ని కూడా ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దిల్లీ మెట్రో భాగస్వామ్యంతో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫీచర్‌తో కూడిన ఉబర్‌ యాప్‌ను ఇటీవల ఆవిష్కరించింది.

ఈ నూతన యాప్​తో వినియోగదారులకు దిల్లీ మెట్రో స్టేషన్ల నుంచి లేదా మెట్రో మార్గంలో పబ్లిక్ బస్సులకు సంబంధించిన సమాచారం యాప్‌లో కనిపించనుంది. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం దేశ రాజధానికే పరిమితం చేయనున్నారు. వినియోదారుల స్పందన ఆధారంగా మిగతా నగరాలకూ విస్తరించే యోచనలో ఉన్నామని ఉబర్‌ సీఈఓ దాదా ఖోస్రోషాహీ తెలిపారు. పూర్తి స్థాయి ఉబర్‌ బస్సు యాప్‌ని ప్రారంభించాలా వద్దా అనేదీ అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉబర్‌ బస్సు సేవలు ఈజిప్టు రాజధాని కైరోలో అందుబాటులో ఉన్నాయి.

ఎసీబస్సులో ఎక్కడికైనా..

పూర్తిస్థాయి పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్ యాప్‌ అందుబాటులోకి వస్తే బస్సు సర్వీసులకు సంబంధించి వినియోగదారులు తమ పికప్‌, డ్రాపింగ్‌ పాయింట్లను ఎంపిక చేసుకోవాలి. అయితే, మనమున్న ప్రతిప్రదేశానికి మాత్రం బస్సు రాదు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఆగుతుంది. అలాగే మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి సమీపంలోని ఉబర్‌ నిర్దేశిత ప్రాంతంలోనే దింపుతారు. ఇక బస్సులన్నింటిలో ఏసీ సౌకర్యం ఉంటుంది.

యాప్‌ ద్వారా బుక్ చేసుకున్న టికెట్‌లోని బార్‌కోడ్‌ని స్కాన్‌ చేసి నగదు రూపంలో లేదా యాప్‌ ద్వారా ఛార్జీ చెల్లించాలి. మన గమ్యస్థానం దగ్గరకు రాగానే మనల్ని అప్రమత్తం చేస్తూ యాప్‌లో నోటిఫికేషన్స్‌ వస్తాయి. బస్సు వెళ్లే మార్గంలో మనం దిగాల్సిన కచ్చితమైన ప్రదేశాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి మనం చేరుకోవాల్సిన స్థానానికి మార్గం కూడా యాప్‌లో చూసుకునే సౌకర్యం ఉంది.

ఇదీ చూడండి: ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు!

ABOUT THE AUTHOR

...view details