హ్యాకర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఎంతటి ప్రముఖుల ఖాతాలనైనా ఇట్టే హ్యాక్ చేసేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఖాతాను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం హ్యాక్ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు డోర్సీ ట్విట్టర్‌ను హైజాక్ చేశారు.
అనుచిత వ్యాఖ్యలు పోస్ట్
ఖాతా నుంచి అనుచిత సందేశాలు పంపారు. జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలను దుండగులు.. సీఈఓ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. వెంటనే పసిగట్టిన సంస్థకు చెందిన నిపుణుల బృందం అప్రమత్తమైంది. జాక్ ఖాతాను హ్యాకర్ల ముప్పు నుంచి కాపాడింది.
నెటిజన్ల ఆగ్రహం
డోర్సీ ట్విట్టర్ ఖాతాను అసలు ఎలా హ్యాక్ చేశారు? భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్ ఖాతానే కాపాడలేనప్పుడు మామూలు యూజర్ల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.