ఏడాదిలోగా దేశంలో టోల్బూత్లన్నింటినీ తొలగించనున్నట్లు తెలిపారు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. వాహనాల నుంచి టోల్ వసూళ్లకు జీపీఎస్- ఆధారిత విధానాన్ని అమలు చేస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వివరించారు.
93శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న గడ్కరీ.. రెట్టింపు టోల్ చెల్లిస్తున్న మిగిలిన 7శాతం వాహనాలు ఫాస్టాగ్‌ను తీసుకోలేదన్నారు.
''దేశంలో సంవత్సరంలోగా అన్ని భౌతిక టోల్ ప్లాజాలు తొలగిస్తామని సభాపూర్వకంగా తెలుపుతున్నా. అంటే.. టోల్ వసూళ్లు జీపీఎస్ ద్వారా జరుగుతాయి. వాహనాలపైన ఉండే జీపీఎస్ ఇమేజింగ్‌తో డబ్బులు వసూలు చేస్తాం.''
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసు విచారణకు ఆదేశించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. వాహనాలకు ఫాస్టాగ్స్‌ను అమర్చకపోతే టోల్ థెఫ్ట్(దొంగతనం), జీఎస్టీ ఎగవేత కింద కేసులు పెడతారని హెచ్చరించారు.
ఫాస్టాగ్ అంటే..
టోల్ ప్లాజాల వద్ద.. ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో టోల్ ఫీజును చెల్లించేందుకు వీలుగా 2016లో ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఇది లేని వాహనాలు.. ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాల వద్ద డబుల్ ఫీజు చెల్లించాలనే నిబంధన ఫిబ్రవరి 16 నుంచి అమల్లో ఉంది.
ఇదీ చూడండి:'రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల విలువైన రహదారులు'
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీతో ప్రయోజనాలు..
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ(తుక్కు పథకం)పై లోక్‌సభలో ప్రకటన చేశారు గడ్కరీ. ఈ విధానంతో ఇంధన సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా.. పర్యావరణహిత వాహనాల సంఖ్య పెరిగి కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోళ్లతో జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు కేంద్రమంత్రి.
ఈ విధానంతో.. వాహన రంగం టర్నోవర్ ప్రస్తుతం ఉన్న రూ. 4.5 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు గడ్కరి.
2022 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశముందన్నారు.
ఐదు శాతం తగ్గింపు..
ఈ పథకం కింద పాత వాహనాలిచ్చి.. కొత్త కార్లు కొనాలనుకునేవారికి ధరలో 5శాతం మినహాయింపు ఉంటుందని నితిన్ గడ్కరీ.. రాజ్యసభలో స్పష్టం చేశారు.
పాత, వినియోగానికి పనికిరాని వాహనాలను దశలవారీగా తగ్గించేందుకు వాలంటరీ 'స్క్రాపింగ్ పాలసీ'ని బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు కేంద్ర ఆరోగ్యమంత్రి నిర్మలా సీతారామన్. వ్యక్తిగత వాహనాలకు 20ఏళ్లు, వాణిజ్యపరమైన వాహనాలకు 15ఏళ్లు గడిచిన అనంతరం ఫిట్నెస్ పరీక్షలు జరిపించాలని స్పష్టం చేశారు. ఇది వాహన ఉత్పత్తి రంగానికి ఊతం అందిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:''స్క్రాపింగ్ పాలసీ'తో ఆటోమొబైల్ రంగానికి ఊతం'