తెలంగాణ

telangana

ETV Bharat / business

వినియోగదార్లకు ఛార్జీలు.. విక్రయదార్లకు వరాలు! - టెలికా ఆఫర్లరు

అపరిమిత కాల్స్‌, రోజువారీ వినియోగానికి కావాల్సినంత డేటా.. వంటి ఆఫర్లతో ఇప్పటివరకు చందాదార్లను టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు ఆకర్షించాయి. ఇప్పుడు అపరిమిత కాల్స్‌పై ఆంక్షలు విధిస్తూ, డేటా వినియోగ ఛార్జీలను కూడా పెంచేస్తున్నాయి. ఈ రూపేణా చందాదార్లకు గతంతో పోలిస్తే ఆర్థిక భారం కలిగిస్తున్నాయి. ఇదేసమయంలో కొత్త చందాదార్లను ఆకర్షించడం కోసం, సిమ్‌ కార్డు విక్రయదార్లకు మాత్రం ఆఫర్లను పెంచుతూ పోతున్నాయి.

ఆఫర్ల రూట్‌ మారింది
TELECOM CHARGES OFFERS

By

Published : Dec 22, 2019, 7:47 AM IST

మూడేళ్ల క్రితం రిలయన్స్‌ జియో సేవలు ఆరంభించినప్పటి నుంచి మొబైల్‌ వినియోగదార్లకు ‘స్వర్ణయుగం’ నడిచిందని చెప్పాలి. కాల్స్‌కు ఛార్జీ ఏమీ లేకుండా అధికవేగం కలిగిన 4జీ డేటాకు మాత్రమే అదీ అతితక్కువ మొత్తాల్లో వసూలు చేయడం ద్వారా, అతి తక్కువ కాలంలోనే 35 కోట్ల చందాదార్లను సాధించి, దేశంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా జియో ఎదిగింది. జియోకు వెళ్లకుండా తమ చందాదార్లను కాపాడుకునేందుకు, కొత్త వారిని జతచేర్చుకునేందుకు.. ప్రైవేటురంగంలో మిగిలిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా దాదాపు జియో లాంటి పథకాలనే అమల్లోకి తెచ్చాయి. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్‌ లేకున్నా, 3జీ సేవల్లోనే ఇలాంటి పథకాలను ఆఫర్‌ చేసి, ధీటుగా నిలిచింది. అంతకుముందు కాలంతో పోలిస్తే, మొబైల్‌ వినియోగదార్లకు ఈ మూడేళ్లలో ఆర్థిక భారం గణనీయంగా తగ్గడమే కానీ పెరిగింది లేదు. ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్‌ అపరిమితంగా చేసుకోవడంతో పాటు రోజుకు 1.5 -2.0 జీబీ వరకు 4జీ డేటాను సామాన్యులు కూడా ‘బిల్లు భయం’ లేకుండా వినియోగించుకున్నారు. అయితే 2019 ముగింపు నెల నుంచి పరిస్థితి మారిపోయింది.

సొంత నెట్‌వర్క్‌పైనే జియో అపరిమిత కాల్స్‌

నెట్‌వర్క్‌ సంస్థల మధ్య అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్నారు. గతంలో అనుకున్న మేర, వచ్చే జనవరి 1 నుంచి ఇది తొలగించాల్సి ఉంది. ఇందుకు పాత సంస్థలు అంగీకరించకపోవడంతో, ఈ ఛార్జీ కొనసాగుతుందన్న నిర్ణయానికి వచ్చిన జియో ఈనెల 6 నుంచి తమ చందాదార్ల వద్ద ఆ సొమ్ము వసూలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌ పరిధిలో అపరిమిత కాల్స్‌ను అనుమతిస్తూనే, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పైనే ఈ ఛార్జీ వసూలు చేస్తున్నామని తెలిపింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌), స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీ, లైసెన్స్‌ రుసుము, వడ్డీ, జరిమానాలు.. అన్నీ కలిపి ప్రభుత్వానికి టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. గట్టెక్కేందుకు ఛార్జీలు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రకటించాయి. దీంతోపాటు రోజుకు 1, 1.5, 2.0 జీబీ డేటా ఇచ్చే పథకాల కాలపరిమితిని తగ్గించడంతో పాటు ఆయా పథకాల రేట్లను 40-50 శాతం వరకు పెంచాయి. వీటితోపాటే జియో కూడా తమ పథకాల ధరలు పెంచింది. ఇప్పుడు జియో నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌ చేసుకునేందుకు ఆయా పథకాల కింద సగటున నెలకు 1,000 నిమిషాల వరకు అవకాశం ఇచ్చింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మాత్రం .. ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు తాము ఛార్జీ వసూలు చేయబోమంటూ తమ పథకాలను సవరించుకున్నాయి. మొత్తంమీద తమ చందాదార్లను కాపాడుకునేందుకు ఈ 3 దిగ్గజ సంస్థలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. టారిఫ్‌లు తక్కువున్నప్పుడు, చందాదార్లను ఆకర్షించడం సులభమే. ధరలు పెరుగుతున్న వేళ మాత్రం రిటైలర్ల సహకారం అవసరమే. అందుకే సిమ్‌కార్డులు విక్రయించేవారిని ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు ఆఫర్ల వల విసురుతున్నాయి.

ఒక్కో సిమ్‌పై రూ.100-200

చందాదార్ల సంఖ్య పరంగా 2-3 స్థానాల్లో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌ నడుమ కనెక్షన్ల యుద్ధం తీవ్రమైంది. దీనితో సిమ్‌కార్డులు విక్రయించే రిటైలర్లను ఆకట్టుకునేందుకు, ఒక్కో కొత్త కనెక్షన్‌పై ఇచ్చే ప్రోత్సాహకాన్ని దాదాపు 3 రెట్లు చేసినట్లు సమాచారం. ఒక కొత్త సిమ్‌కార్డుపై రూ.100-200 వరకు ప్రాంతాన్ని బట్టి రిటైలర్‌కు టెలికాం సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. వేరే సంస్థ నుంచి మొబైల్‌ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా చందాదారును ఆకర్షించగలిగితే మరింత అధికంగా చెల్లిస్తున్నాయి. సహజంగా నెంబరుపై ఆసక్తి ఉన్నవారు, విద్య-ఉద్యోగ-వ్యాపార-వినియోగ సంస్థలతో అనుసంధానమైన మొబైల్‌ నెంబరును కాపాడుకునేందుకు కనెక్షన్‌దారులు ఆసక్తి చూపుతారు. రీఛార్జి చేస్తేనే నిలుస్తుంది కనుక, ఈ నెంబరును తప్పనిసరిగా పరిరక్షించుకుంటుంటారు. సాధారణంగా ఈ నెంబరే రోజువారీ అవసరాలకూ వాడతారు. అందువల్ల అధిక ఆదాయం రావడంతో పాటు పోటీ సంస్థకు కనెక్షన్‌-ఆదాయం తగ్గుతుందనే భావనతో, ఎంఎన్‌పీకి సంస్థలు అధిక ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. రిటైలర్‌కు ఒక్కసారి నగదు ఇస్తే.. చందాదారు తమ దగ్గర ఉన్నంతకాలం ఆదాయం వస్తుంది కనుక, టెలికాం సంస్థలు ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పోటీ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాల్సిందే.

ఇదీ చూడండి: అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా!

ABOUT THE AUTHOR

...view details