టెలికాం సంస్థల మధ్య టారిఫ్ యుద్ధం కాస్త తగ్గి.. ఇప్పుడు రింగ్టైమ్ యుద్ధం తెరపైకి వచ్చింది. డేటా పోటీకి తెరలేపిన జియోనే.. ఈ రింగ్ టైమ్ యుద్ధానికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.
అసలేంటి ఈ రింగ్ టైమ్ యుద్ధం..
దేశంలోని ప్రధాన టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ వినియోగదారులు చేసే కాల్స్‌పై రింగింగ్ సమయాన్ని 30-45 సెకన్ల నుంచి ఏకంగా 25 సెకన్లకు తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్ జియో తమ కాల్స్‌కు రింగ్టైమ్ను 25 సెకన్లకు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ రెండు సంస్థలు వాదిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా కొన్ని సర్కిళ్లలో మాత్రమే రింగ్ టైమ్ తగ్గించింది.
రింగ్ సమయం తగ్గిస్తే ఎవరికి లాభం...?
రెండు వేరు వేరు నెట్‌వర్క్‌ల మధ్య ఫోన్‌కాల్స్ మాట్లాడాలంటే కాల్ చేసిన నెట్‌వర్క్.. కాల్ రిసీవ్ చేసుకున్న నెట్‌వర్క్‌కు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ(ఐయూసీ) చెల్లించాల్సి ఉంటుంది. రింగింగ్ సమయాన్ని తగ్గిస్తే.. వినియోగదారుడు ఆన్సర్ చేసేలోపే కాల్ కట్ అవుతుంది. అప్పుడు వేరే నెట్‌వర్క్ నుంచి కాల్స్ వచ్చేలా చేసుకోవచ్చని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి.