ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే టెక్స్ట్ మెసేజ్‌లే దిక్కు.. ఆ సమయంలో ఫ్రీ మెసేజింగ్ సౌలభ్యంతో వాట్సాప్ వచ్చి అందరినీ ఆకర్షించింది. యూజర్ల సమాచార గోప్యతకు హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఓ దశాబ్దం పాటు వాట్సాప్ ఏ స్థాయికి ఎదిగిందో తెలిసిందే. వాట్సాప్ లేని ఫోన్ లేదంటే నమ్మశక్యం కాదు.
అయితే సరిగ్గా పదేళ్లకు వాట్సాప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇది ఇతర కంపెనీల నుంచి వచ్చింది కాదు. తాము తెచ్చిన అప్డేటే వాట్సాప్‌కు నష్టం చేసింది. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాలసీపై యూజర్స్ ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎందుకు ఆందోళనన..
గతంలో ఏదైనా కంపెనీ తమ విదివిధానాల్లో మార్పులు చేస్తే వాటిని అంగీకరించాలా వద్దా అనేది యూజర్స్ చేతుల్లో ఉండేది. కానీ ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ తాజా పాలసీని తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. లేదంటే ఆ రోజు నుంచి వారి వాట్సాప్ ఖాతా పనిచేయదని సంస్థ తెలపడం యూజర్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో వాట్సాప్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. అంతేకాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ యూజర్స్ అందరు సిగ్నల్ ఉపయోగించాలని సూచించాడు.
వెనక్కి తగ్గిన వాట్సాప్..
అయితే కొత్త ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు అప్‌డేట్‌ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా..తాజా నిర్ణయంతో అది మరికొంత కాలం నిలిచిపోనుందని తెలిపింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాలు..
వాట్సాప్‌పై అసంతృప్తిగా ఉన్న యూజర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రత్యామ్నాయాలు ఏంటి.. అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.