కరోనా ప్రభావం ప్రతి రంగంపై తీవ్రంగా పడింది. అంకురాలపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. లాక్‌డౌన్ తదనంతర పరిస్థితులు, భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాకపోవటం వల్ల అవి ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ నుంచే వాటిలో పెట్టుబడులు చాలా వరకు ఆగిపోయాయి. ఆ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని అంకురాల వ్యవస్థాపకులు చెబుతున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచే అంకురాల్లో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. వేచి చూసే ధోరణిలో పెట్టుబడిదారులు ఉన్నారు. ఇప్పటికే అదే పరిస్థితి కూడా కొనసాగుతోంది. అయితే కొన్ని రంగాలకు సంబంధించిన వాటిలో పెట్టుబుడులు వస్తున్నాయి.
కరోనా ప్రారంభమైన మొదట్లోనే కొన్ని అంకురాలు కో-వర్కింగ్ స్పేస్ నుంచి కార్యకలాపాలను ఇంటి వద్దనుంచే నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్ మొదట్లోనే సాంకేతిక అంకురాలు ఆన్‌లైన్‌కు మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఆ పరిస్థితే కొనసాగుతోంది. సాధారణంగానే తక్కువ మందితో పనిచేసే అంకురాల్లో జీతాలు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.
కొన్నింటికి లాభం, మరికొన్నింటికి నష్టం...
కొన్ని రంగాల్లోని అంకురాలపై ప్రతికూల ప్రభావం పడగా… కొన్నింటికి అభివృద్ధికి మాత్రం కరోనా ఉపయోగపడింది. లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, ట్రాన్స్‌పోర్ట్ లోని అంకురాలపై ప్రతికూల ప్రభావం పడింది. విమానయానానికి సంబంధించిన అంకురాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఆరోగ్య సంబంధింత అంకురాలు.. మెడిసిన్, సరుకుల డెలివరీ, ఎడ్యూకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల అంకురాలు లాంటివి లాభపడ్డాయి.
పరిస్థితులకు అనుగుణంగా మారుతోన్న అంకురాలు లాభపడ్డట్లు ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా మూలంగా కొన్ని వ్యాపార శైలిని మార్చుకున్నాయి. ఒలా, ఉబర్ లాంటి సంస్థలు షేరింగ్ ఆప్షన్ ను తీసేశాయి. అంతేకాకుండా కరోనా వ్యాప్తి జరగకుండా డ్రైవర్‌కు ప్రయాణికుడికి భౌతికంగా సంబంధం ఉండకుండా చర్యలు తీసుకున్నాయి. దీనివల్ల ప్రయాణికులు కూడా వాటిల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. చిన్న అంకురాలు కూడా వాటి వ్యూహంలో మార్పులు చేసుకుంటున్నాయి.