తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత మార్కెట్​ నుంచి సోనీ ఫోన్లు ఔట్ - స్మార్ట్​ ఫోన్​ వ్యాపారాలు

వరుస నష్టాల కారణంగా భారత్ సహా పలు దేశాల్లో స్మార్ట్​ఫోన్​ వ్యాపారాలు నిలిపివేయనున్నట్లు దిగ్గజ సంస్థ సోనీ ప్రకటించింది. అమ్మకాలు నిలిపివేసినా.. ఇతరత్రా సమస్యలకు అన్ని రకాలుగా వినియోగదార్లకు అందుబాటులో ఉంటామని తెలిపింది.

సోనీ

By

Published : May 24, 2019, 2:21 PM IST

జపాన్​కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం 'సోనీ' సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​లో స్మార్ట్ ఫోన్ వ్యాపారాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్నేళ్లుగా ఈ వ్యాపారంలో సంస్థకు భారీ నష్టాలు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గట్టిపోటీయే కారణం..

నాణ్యమైన ప్రమాణాలు పాటించే స్మార్ట్​ఫోన్​ బ్రాండుగా వినియోగదార్లలో సోనీకి మంచి పేరుంది. అయితే గత కొన్నేళ్లుగా స్మార్ట్​ ఫోన్ల వ్యాపారంలో చాలా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు ఉన్న ఫోన్లను విక్రయిస్తున్నాయి. వాటితో సోనీ పోటీ పడలేకపోయిందనే చెప్పాలి.

ఈ కారణంగా సంస్థకు వరుసగా నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థను గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సోనీ.

ఇందుకోసం భారత్​తో సహా దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికాల్లో సంస్థ స్మార్ట్​ఫోన్​ వ్యాపారాలు మూసివేయనున్నట్లు తెలిపింది. నిర్వహణ వ్యయాలను కూడా తగ్గించుకోనున్నట్లు పేర్కొంది.

అయితే కొత్త ఫోన్ల అమ్మకాలు నిలిపివేసినా.. అన్ని రకాలుగా వినియోగదార్లకు సేవలందించనున్నట్లు పేర్కొంది.

పట్టున్న మార్కెట్లపై దృష్టి

సోనీ బ్రాండ్ ఫోన్లకు పెద్ద మార్కెట్లుగా ఉన్న జపాన్​, యూరప్​, హాంకాంగ్​, తైవాన్​ దేశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సోనీ తెలిపింది. 5జీ సాంకేతికతను అందిపుచ్చుకుని 2020 లోపు మళ్లీ లాభాల బాట పట్టించాలని సోనీ పట్టుదలగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details