తెలంగాణ

telangana

ETV Bharat / business

టెల్కోలకు షాక్.. రూ.92 వేల కోట్ల ఫైన్ కట్టాల్సిందే! - ఎయిర్​టెల్​పై భారీ ఫైన్

టెలికాం సంస్థలకు, టెలికాం శాఖకు మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఏజీఆర్​పై సుప్రీం కీలక తీర్పునిచ్చింది. ఏజీఆర్​పై టెలికాం శాఖ నిర్వచనాన్ని సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ తీర్పుతో టెల్కోలు రూ.92,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించడం అనివార్యమైంది.

టెలికాం సంస్థలకు భారీ జరిమానాలు

By

Published : Oct 24, 2019, 4:44 PM IST

దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో గట్టిఎదురుదెబ్బ తగిలింది. టెలికాం సంస్థల నుంచి రూ.92,000 కోట్ల.. సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఎర్​)ను తిరిగి రాబట్టేందుకు కేంద్రప్రభుత్వానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది.

జస్టిస్​ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంపై టెలికాం శాఖ నిర్వచనాన్ని సమర్థించింది.
"టెల్కోల లైసెన్సులు రద్దు చేసేందుకు టెలికాం శాఖకు మేము అనుమతిస్తున్నాము. "
- సుప్రీం ధర్మాసనం తీర్పు

ఈ అంశాన్ని సవాలు చేస్తూ వివిధ టెల్కోలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సర్వీస్​ ప్రొవైడర్లు నిర్ణీత గడువులోగా అపరాధ రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోసారి ఈ అంశంపై విచారణ ఉండబోదని తేల్చిచెప్పింది.

ఎవరికి ఎంత ఫైన్​ అంటే...

టెలికాం శాఖ ప్రకారం.. రూ.21,682.13 కోట్ల లైసెన్స్​ రుసుము బకాయితో ఎయిర్​టెల్ మొదటి స్థానంలో ఉంది. వొడాఫోన్ రూ.16,456.47 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్​ 16,456.47 కోట్ల బకాయిలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్​ఎన్​ఎల్​ 2,098.72 కోట్లు, ఎంటీఎన్​ఎల్ రూ.2,537.48 కోట్లు బకాయి పడ్డాయి. అన్ని సంస్థలు కలిపి రూ.92,641.61 కోట్లు చెల్లించాల్సి ఉందని టెలికాం శాఖ తెలిపింది.

కోర్టు తీర్పుపై నిరాశ..

టెల్కోల నుంచి రూ.92,000 కోట్లు వసూలు చేయాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై ఎయిర్​టెల్ స్పందించింది. న్యాయస్థానం నిర్ణయంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సంస్థలపై మరింత భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేసింది. కోర్టు నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు వెల్లడించింది.

15 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్న టెలికాం సంస్థలపై ఈ తీర్పు ప్రభావం పడుతుందని.. ప్రస్తుతం రెండే ప్రైవేటు సంస్థలు మిగిలాయని పేర్కొంది.
ఈ అంశాన్ని పునఃసమీక్షించాలని, టెల్కోలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించింది ఎయిర్​టెల్​.

ఇదీ చూడండి: ఇన్ఫీ గోల్​మాల్​ ఆరోపణలపై దర్యాప్తులు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details