పండుగ ముందు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్లుగానే ఈ ఏడాది వరుసగా ఐదో సారి(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో సారి) రెపో రేటు తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో.. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశం అనంతరం వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆర్బీఐ.. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ (రెపో రేటు) 5.15 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటును (బ్యాంకులు ఆర్బీఐకి ఇచ్చే రుణాలపై వడ్డీ) 4.90 శాతంగా నిర్ణయించింది ఆర్బీఐ. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 135 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గించింది ఆర్బీఐ.
వడ్డీ కోతతో ఎవరెవరికి ఊరట?
గృహ, వాహన రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది. రెపో కోత ఫలాలను.. రుణ గ్రహీతలకు నేరుగా అనుసంధానం చేసే విధానం ఈ నెల నుంచే ప్రారంభమైంది.