కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని ఫార్మా సంస్థలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం రూ.14వేల కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై ఔషధ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్ఏ పరీక్ష కిట్ల తయారీకి కృషి చేయాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు.
" అవసరమైన మందులు, సామగ్రి సరఫరా చేయటమే కాకుండా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి. దేశంలో ఫార్మాకి అవసరమైన ఔషధాల నిర్వహణ, తయారీ, సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్లిష్టమైన ఔషధాలు, వైద్య పరికరాలు దేశంలోనే తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.10వేల కోట్లు, రూ.4వేల కోట్ల విలువైన రెండు పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవసరమైన ఔషధాల సరఫరాను పెంచుతూనే నల్లబజారును నిరోధించడం అత్యవసరం. అందుకు తగిన విధంగా కృషి చేయాలి. కోవిడ్-19 సవాలును ఎదుర్కోవడంలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఔషధ చిల్లర వ్యాపారులు, విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. "