కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ఆన్లైన్లో కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఓ నివేదికలో తెలిపింది. వైరస్ సంక్రమణ, శుభ్రత భయాలతో ఎక్కువ మంది ఇటీవల సొంత వాహనాల వినియోగానికి మొగ్గుచూపుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా ఇతరులు లేకుండా సొంత వాహనంలో సురక్షితంగా ప్రయాణాలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిణామం ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోయిన కార్ల అమ్మకాలు అదే స్థాయిలో పెరిగేందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అన్నింటికీ ఆన్లైన్...
కరోనా కారణంగా చాలా అవసరాలకు ఆన్లైన్ వేదికను వినియోగిస్తున్నారు. కార్ల కొనుగోలు విషయంలోనూ అదే తీరు కనిపించొచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పేర్కొంది. వీటికి తోడు రిటైల్ స్టోర్లవద్ద కార్ల కొనుగోలుకు వినియోగదారులు సంకోచిస్తుండటం కూడా ఆన్లైన్ మార్కెట్ వృద్ధికి దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడింది.
ఇందుకోసం వాహన రిటైలర్లు.. వినియోగదారులకు సులభంగా ఆన్లైన్లో కొనుగోళ్లకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. చైనాలో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలు తెలిసినట్లు వెల్లడించింది.