తెలంగాణ

telangana

ETV Bharat / business

పోలింగ్​కు దూరంగా దిగ్గజ వ్యాపారవేత్తలు! - ambani news

ముంబయిలోని దిగ్గజ వ్యాపార వేత్తలు సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంబానీ సోదరులు, రతన్​ టాటా, సజ్జన్​ జిందాల్​, టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బిజీ షెడ్యూల్​ కారణంగానే వీరందరూ ఓటు హక్కు వినియోగించుకోలేదని వారి అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.

ముంబయిలో దిగ్గజ వ్యాపార వేత్తలు పోలింగ్​కు దూరం!

By

Published : Oct 22, 2019, 5:24 AM IST

Updated : Oct 22, 2019, 9:02 AM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సామాన్య జనంతో పాటు బాలీవుడ్​ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.​ సాయంత్రం ఓటింగ్​​ ముగిసే సమయానికి దాదాపు 2014 ఎన్నికల(63.38 శాతం) మాదిరిగానే ఈసారీ 63శాతం పోలింగ్​ నమోదైంది.

పోలింగ్​కు దూరంగా దిగ్గజ వ్యాపార వేత్తలు

అయితే దిగ్గజ వ్యాపార వేత్తలైన రతన్ టాటా, ముకేశ్​ అంబానీ, అనిల్ అంబానీ, సజ్జన్​ జిందాల్​, టాటా​ సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ లాంటి వారు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. బిజీ షెడ్యూల్​ వల్లే వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని వారి అధికార ప్రతినిధులు తెలిపారు. చంద్రశేఖరన్​తో పాటు జిందాల్​ సోమవారం ముంబయిలో లేరని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్వీట్​ చేశారు జిందాల్​.

సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ కుటుంబంతో పాటు వచ్చి ఓటు వేసే అంబానీ సోదరులు.. ఈ సారి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్​లో ముకేశ్​, అనిల్​ అంబానీల గైర్హాజరుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఓటేసిన ప్రముఖ వ్యాపార వేత్తలు వీరే..

మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ ఛీప్​ ఎగ్జిక్యూటివ్​ కెకీ మిస్త్రీ, మారికో ఛైర్మన్​ హర్ష్​ మారివాలా, ఎం అండ్ ఎం మేనేజింగ్​ డైరెక్టర్​ పవన్​ గొయెంకా తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

గురువారం ఫలితాలు

మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ.. భాజపాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని తెలిపాయి. గురువారం తుది ఫలితాలు వెలువడనున్నాయి.

Last Updated : Oct 22, 2019, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details