పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఫుడ్ చైన్ల ఆపరేటర్ దేవ్‌యాని ఇంటర్నేషనల్.. ఈ నెల 4న ఐపీఓకు రానుంది. సబ్స్క్రిప్షన్ చివరి తేదీ ఆగస్టు 6. ఐపీఓలో ఒక్క షేరు ధరను రూ.86-90గా నిర్ణయించింది. రూ.1,838 కోట్ల సమీకరించే ఉద్దేశంతో దేవ్‌యాని ఇంటర్నేషనల్ ఐపీఓకు వస్తోంది. ఇందులో రూ.440 కోట్ల విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేస్తుండగా.. 15.53 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది కంపెనీ.
హెల్త్ సెక్టార్కు చెందిన క్రిష్ణా డయాగ్నోస్టిక్స్ కూడా.. ఈ వారమే ఐపీఓకు రానుంది. మొత్తం రూ.1,213 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓకు వస్తోంది. ఐపీఓకు కంపెనీ షేరు ధర రూ.933-954గా నిర్ణయించింది. షేర్ల సబ్స్క్రిప్షన్ 4న ప్రారంభమై.. 6వ తేదీన ముగియనుంది.
ఐపీఓకు పీబీ ఫిన్టెక్ దరఖాస్తు..
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పైసాబజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసా బజార్ల మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ ఐపీఓకు సిద్దమైంది. రూ.6,017.50 కోట్లను సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు అనుమతి కోరుతూ.. సెబీకి ప్రాథమిక దరఖాస్తు చేసుకుంది.
ఇందులో రూ.3,750 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా ఇష్యూ చేయనుండగా.. రూ.2,267.50 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు దరఖాస్తులో పేర్కొంది పీబీ ఫిన్టెక్. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎస్వీఎఫ్ పైతాన్ 2 (సైమన్) రూ.1,875 కోట్ల షేర్లను, కంపెనీ సహ వ్యవస్థాపకులు యాశిష్ దహియా రూ.250 కోట్ల కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది.