రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. జాయింట్ వెంచర్లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎమ్ఎస్ఎమ్ఈల్లోనూ చైనా సంస్థల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించదని పేర్కొన్నారు.
చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది..
"రోడ్డు నిర్మాణాలకు సంబంధించి చైనా భాగస్వామిగా ఉండే జాయింట్ వెంచర్లకు అనుమతినివ్వము. ఈ విషయంపై మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. చైనా సంస్థల నిషేధానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తాం. దీనితో పాటు రహదారుల నిర్మాణంలో భారతీయ సంస్థలు భాగస్వాములుగా ఉండేందుకు కొన్ని నిబంధనలను సడలిస్తాం. సాంకేతిక, ఆర్థిక నిబంధనల్లో మార్పులు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని.. ఇప్పటికే హైవే కార్యదర్శి గిరిధర్ అరామనే, ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ ఎస్ ఎస్ సంధుకు ఆదేశాలిచ్చాను. నియమాల మార్పుతో భారత సంస్థలను ప్రోత్సహించినట్టు అవుతుంది."