బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని చాలా మంది అనుకుంటారు. అందులో కొంత మంది మాత్రమే అనుకున్నట్లు కోటీశ్వరులుగా మారతారు. కోరికకు తగ్గుట్లుగా ఆచరణ ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సమయం, అవకాశం రెండూ చేజారితే తిరిగి పొందడం అసాధ్యం అనేది ఎంత సత్యమో... పొదుపు, మదుపులూ అంతే. సరైన ఆచరణ లేకపోతే ఆర్థిక లక్ష్యాలను చేరడం కష్టం. లక్ష్య సాధనలో పొరపాట్లు దొర్లితే తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు.
ప్రస్తుతం చాలా మందిని సంపాదన విషయం అడిగితే.. వేలల్లో జీతాలు అందుకుంటున్నట్లు చెబుతారు. కానీ నెలాఖరు ఖర్చులు సరిపోక మళ్లీ అప్పుల వేటలో పడతారు. ఇక అనుకోని కారణాలతో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. అయితే ఆర్థిక ప్రణాళికను అమలు చేసేటప్పుడు దొర్లే సాధారణ పొరపాట్లు ఏంటి? వాటిని అదిగమించడం ఎలానో తెలుసుకుందాం.
ఖర్చులు అదుపులో లేకపోవడం...
ఎంత సంపాదించినా అంతా ఖర్చవుతుందని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని గణాంకాల ప్రకారం దేశంలో సంపాదించే వారిలో 52 శాతం మంది వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారని తేలింది. వీరిలో కొంత మంది ఆదాయంతో పాటు అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని అధికంగా ఖర్చులు చేస్తున్నారు. ఈ కారణంగా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను ఎప్పటికీ చేరలేకపోతున్నారు.
ఇలా జరగకుండా.. ఎక్కువ ఖర్చులు చేస్తున్నాం అని భావించినప్పుడు వాటిపై నిఘా వేయండి. ఎక్కడ వృథా ఖర్చులు అవుతున్నాయో గుర్తించండి. అవసరమైన మేరకే ఖర్చులు చేయడం.. ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కనీస ప్రణాళిక పాటిస్తే ఖర్చులు అదుపులో ఉండి.. మిగులు కనిపిస్తుంది.
పొదుపు తప్పదు...
ఆర్థిక లక్ష్యాలను చేరాలనుకుంటే మొదటగా చేయాల్సింది పొదుపు. పెరిగిన నిత్యవసరాలు, ఇతరత్రా ఖర్చులు, రుణాలపై వడ్డీలు సంపదను ఆవిరి చేస్తున్నాయని చాలా మంది అంటుంటారు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులపై ఆలోచన ఎలా అని భావిస్తుంటారు. అయితే.. పొదుపు అనేది ఖర్చు పెట్టాక మిగిలింది కాదు.. ప్రతి నెల లక్ష్యంగా పెట్టుకుని కొంత మొత్తాన్ని దాయడమే పొదుపు అనేది గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా తప్పని సరి ఖర్చులు ఎలానో అదే విధంగా పొదుపునూ తప్పని సరి జాబితాలో చేర్చుకోవాలి.
ప్రస్తుతం పొదుపు చేసిన మొత్తం విలువ ఐదేళ్ల తర్వాత ఎంతుంటుందో కచ్చితంగా చెప్పలేం. అందుకే వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వేతన జీవులు.. వారి ఆదాయంలో కనీసం 10 శాతం నుంచి 20 శాతం వరకు పొదుపు చేయాలని అర్థిక నిపుణులు సూచిస్తున్నారు.