ఎరువుల వాడకంలో సమతుల్యత, పరిశ్రమ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఫాస్పెటిక్, పొటాషిక్ ఎరువులకు మాత్రమే నిర్ణయిస్తోన్న పోషక ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) రేట్లను యూరియాకూ అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
2010 నుంచి..
రసాయన ఎరువులకు స్థిర మొత్తంలో రాయితీ ఇచ్చేందుకు పోషక ఆధారిత రాయితీ (ఎన్బీఎస్) రేట్ల పద్ధతిని 2010లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని వార్షిక ప్రాతిపాదికన నిర్ణయిస్తారు. దీని ద్వారా ఫాస్పెటిక్, పొటాషిక్ (పీ&కే) ఎరువులకు రాయితీలో గ్రేడ్లు అందిస్తున్నారు. ఇందులో యూరియాకు మినహాయింపు ఇచ్చారు.
" పీ&కే ఎరువులకు ఇప్పటికే ఎన్బీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాం. కానీ అమలులో సమస్యల వల్ల యూరియాకు ఇప్పటి వరకూ ప్రవేశపెట్టలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. యూరియాకూ ఎన్బీఎస్ పద్ధతి ద్వారా రేట్లను నిర్ణయించే ఆలోచనలు చేపట్టింది ఎరువుల మంత్రిత్వ శాఖ."
-ఎరువుల శాఖ అధికారి