గూగుల్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ మెయిల్ సేవల దిగ్గజం జీ మెయిల్ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. పాల్ బుఖైట్ ఏప్రిల్ 1, 2004న దీన్ని ప్రారంభించారు.
ఇది ప్రారంభమయ్యే సమయానికి మెసేజింగ్ సేవల్లో అగ్రస్థానంలో ఉంది యాహూ మెయిల్. దాన్ని కొన్నేళ్లలోనే వెనక్కి నెట్టి సంచలనంగా మారింది. ప్రస్తుతం జీ మెయిల్‌కు నెలకు 1.5 బిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా... యాహూ మెయిల్‌కు 228 మిలియన్ల వినియోగదారులున్నారు.
ఇందుకు కారణం కూడా లేక పోలేదు. ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవసరమైన మార్పులు చేస్తూ సేవలను విస్తరించడం కారణంగా ఈ రంగంలో అగ్ర స్థానంలో నిలవగలిగింది జీ మెయిల్. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 105 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండటం కూడా ఓ కారణమే.
ప్రారంభ సమయంలో ఒక వినియోగదారునికి 1 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో సేవలందించిన జీ మెయిల్ ఇప్పడు 15 జీబీల సామర్థ్యాన్ని వినియోగదార్లకు అందిస్తోంది.
సాధారణ వినియోగదార్లకు ఇప్పటికీ జీ మెయిల్ సేవలు ఉచితంగానే అందిస్తుండగా... వాణిజ్య అవసరాలకు మాత్రం పెయిడ్ సేవలందిస్తోంది.