విదేశీ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడుల పెట్టాలనే ఆసక్తి దేశీయ మదుపర్లలో పెరుగుతోంది. అలాంటి వారి కోసం ఓ అంతర్జాతీయ పెట్టుబడుల ప్లాట్‌ఫాంను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రపంచంలోని ఎక్కడ నుంచైనా ఒకటే ఖాతా ద్వారా అమెరికా సహా ఇతర ప్రపంచ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
ఇందుకుగాను న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం స్టాకాల్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంను జియోజిత్ అభివృద్ధి చేసింది. ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని తెచ్చుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందని తెలిపింది. 2020 ప్రారంభం నుంచి ప్రపంచ మార్కెట్లలో దేశీయ చిన్న మదుపర్లు రూ.350 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని మార్కెట్ గణాంకాలను ఉటంకిస్తూ సంస్థ వివరించింది.