భారత టెలికాం దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియాకు భారీ మొత్తంలో పెనాల్టీ విధించనుంది డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్(డీసీసీ). కొత్తగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో రిలయన్స్ జియో అనుసంధానం కోసం.. ఈ సంస్థలు ప్రొవైడింగ్ పాయింట్లు కేటాయించని కారణంగా చర్యలు తీసుకోనుంది.
ఎయిర్టెల్, వొడా-ఐడియాకు భారీ పెనాల్టీ ఖాయం? - Trai
రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీకి నిరాకరించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాకు భారీ జరిమానా పడడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికాం కంపెనీలపై చర్యలు తీసుకునే సర్వాధికారాలున్న డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్(డీసీసీ).. జరిమానా విధింపునకు ఆమోదం తెలిపింది. అయితే... నిర్ణయం అమలుకు ముందు ట్రాయ్ను అభిప్రాయం కోరింది.
ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాకు రూ.3 వేల 50 కోట్లు జరిమానా విధించాలని 2016 అక్టోబర్లో సిఫార్సు చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్). అయితే... పెనాల్టీ విలువను పునఃసమీక్షించడంపై అభిప్రాయం చెప్పాలని తాజాగా ట్రాయ్ను కోరింది డీసీసీ.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో రిలయన్స్ జియో విఫలమైందని.. అందుకు ఈ సంస్థపైనా పెనాల్టీ విధించాలని కోరారు డీసీసీలోని ఓ ప్రతినిధి. సదరు కంపెనీలపై జరిమానాకు ఆమోదించిన కమిషన్.. రిలయన్స్ జియోపై పెనాల్టీకి అంగీకరించలేదు.