ఫార్మా కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన ఐటీ సిస్టమ్స్‌పై సైబర్ దాడి జరిగింది. డాక్టర్ రెడ్డీస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మనదేశంతో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, రష్యా దేశాల్లో ఈ కంపెనీకి ఫార్మా యూనిట్లు ఉన్నాయి.
సైబర్ దాడి నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. డేటా కేంద్రాల్లోని సర్వర్లను తాత్కాలికంగా మూసివేశారు. తద్వారా మరింత నష్టం జరగకుండా, అదే సమయంలో సమాచారం బయటకు వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు.
సైబర్ దాడి తీవ్రత, దానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు, అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ సర్వర్లను సిద్ధం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వచ్చే 24 గంటల వ్యవధిలో సర్వర్లు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఐఓ ముఖేష్ రథి తెలిపారు. ఈ ఉదంతం వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం పడలేదని పేర్కొన్నారు.
జపాన్‌లోనూ ఇదేవిధంగా..
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇటీవల కాలంలో కొవిడ్-19 టీకా, ఔషధాలకు సంబంధించిన పరిశోధనలు పెద్దఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ వి’ టీకాను మనదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా సంస్థ అయిన ఆర్‌డీఐఎఫ్‌తో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ 2-3 దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించటానికి డీసీజీఐ (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి కోసం దరఖాస్తు చేసింది. కొన్ని ఔషధాలను కూడా కొవిడ్-19 చికిత్స కోసం ఈ సంస్థ పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఐటీ సిస్టమ్స్‌పై సైబర్ దాడి జరగటం ఫార్మా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొవిడ్-19 టీకా తయారీకి సంబంధించిన ప్రయోగాల్లో నిమగ్నమై ఉన్న జపాన్ కంపెనీలపై రెండు రోజుల క్రితం ఇదేవిధంగా సైబర్ దాడి జరిగిన విషయం గమనార్హం. చైనా నుంచి హ్యాకర్లు జపాన్ కంపెనీలకు చెందిన ఐటీ సిస్టమ్స్‌పై దాడి చేసినట్లు గుర్తించారు. ఇటువంటిదే డాక్టర్ రెడ్డీస్ పైన కూడా జరిగిందా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.