ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహమందించే దిశగా ప్రభుత్వం భారీ ఉద్దీపనలతో ముందుకొస్తోంది. ఇందులో భాగంగా 34.94 శాతంగా ఉన్న కార్పొరేట్ సుంకాన్ని 25.17 శాతానికి తగ్గించడంపై కార్పొరేట్లు, ఆర్థిక వేత్తలు, ఆర్బీఐ గవర్నర్, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కార్పొరేట్ సుంకం తగ్గింపుపై ఎవరెవరు ఏమన్నారంటే..? సాహసోపేత నిర్ణయం..
కార్పొరేట్ సుంకాలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వృద్ధి ప్రోత్సాహానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అందరూ ఆమోదించదగ్గ ఉద్దీపనగా పేర్కొన్నారు.
పారిశ్రామిక వర్గాల హర్షం..
కార్పొరేట్ సుంకాల కోతపై స్టాక్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఈ ఉద్దీపన మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
"గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా కార్పొరేట్ సుంకాలు తగ్గించింది ప్రభుత్వం. కంపెనీలకు ఇదీ భారీ ప్రోత్సాహకం. వాటి ఉత్పత్తుల ధరల తగ్గింపునకూ ఇది ఉపయోగపడుతుంది. కంపెనీలు వాటి ఉత్పత్తుల తయారీకి కొత్త యూనిట్లు స్థాపించేందుకూ ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుంది. మేక్ ఇన్ ఇండియాను మరింత బలపరిచేందుకు ఈ ఉద్దీపన తోడ్పడుతుంది." - రజనీశ్ కుమార్, ఎస్బీఐ ఛైర్మన్
"కార్పొరేట్ సుంకాన్ని 25 శాతానికి తగ్గించడం బిగ్ బ్యాంగ్ సంస్కరణ. ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహమందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇదే ఉదాహరణ." -ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా సీఈఓ
"కార్పొరేట్ సుంకం 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాలని కంపెనీల నుంచి ఎప్పటి నుంచో వస్తోన్న డిమాండ్. ఆ దిశగా ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకోవడం గొప్పవిషయం." - విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ అధ్యక్షుడు
"కార్పొరేట్ కంపెనీలకు సుంకాలు, సెస్, సర్ఛార్జీల తగ్గింపు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిస్తుంది. తయారీ, మౌలిక వసతుల రంగంపై దీని ప్రభావం అత్యంత సానుకూలంగా ఉంటుంది. రానున్న రోజుల్లో జీడీపీ 8 శాతం నుంచి 9 శాతానికి వృద్ధి చెందేందుకు ఇలాంటి ఉద్దీపనలు తోడందిస్తాయని దృఢంగా విశ్వసిస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే వేలాదిమందికి ఉద్యోగ కల్పన సహా దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించినట్లుగానే.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని భావిస్తున్నాం." - అనిల్ అగర్వాల్, వేదాంత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు.. ప్రతాప్ సి రెడ్డి (అపోలో హాస్పిటల్ ఛైర్మన్), అజయ్ సింగ్ (స్పైస్ జెట్ ఎండీ), గోపీచంద్ పీ హిందుజా (హిందుజా గ్రూప్ కో-ఛైర్మన్), ఆశిశ్ కుమార్ (బీఎస్ఈ ఎండీ&సీఈఓ) సహా పలువురు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు.
వృద్ధికిది భారీ ప్రోత్సాహం..
కార్పొరేట్ సుంకం దాదాపు 10 శాతం మేర తగ్గించి 25.17 శాతంగా నిర్ణయించడం పట్ల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ హర్షం వక్తం చేశారు.
"కంపెనీలకు కార్పొరేట్ సుంకాల తగ్గింపు నిర్ణయం.. వృద్ధికి తప్పకుండా తోడ్పడుతుంది. మేము పలు దఫాల్లో ఉద్దీపనలను తెచ్చాం. నేడు ప్రకటించినది భారీ ఉద్దీపన." - పీయూష్ గోయల్, వాణిజ్య మంత్రి
సుంకాల తగ్గింపు బాగుంది కానీ...
కార్పొరేట్ సుంకాలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్వాగతించారు. పన్నుల తగ్గింపు నిర్ణయం మంచిదే అయినా అది.. పెట్టుబడులను పెంచుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కేంద్రం ఉద్దీపనలతో.. దలాల్ స్ట్రీట్లో బుల్ జోరు