తెలంగాణ

telangana

ETV Bharat / business

అగమ్యగోచరంగా చైనా యాప్​ల భవితవ్యం - china issues with india

59 చైనా యాప్​లపై నిషేధం విధించింది భారత్. ప్రభుత్వ నిర్ణయంతో భారత్​ను అతిపెద్ద మార్కెట్​గా భావించి పెట్టుబడులు పెట్టిన డ్రాగన్ వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలు ఎదుర్కోనున్నాయని అంచనాలు నెలకొన్నాయి. భారత్​లో భవిష్యత్​ పెట్టుబడి ప్రణాళికలపైనా చైనా సంస్థలు పునరాలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ యాప్​ల భవితవ్యంపై సమగ్ర కథనం.

china
అగమ్యగోచరంగా చైనా యాప్​ల భవితవ్యం

By

Published : Jul 1, 2020, 7:17 AM IST

భారత్‌లో బహుళ ప్రజాదరణ పొందిన చైనా యాప్‌ల్లో తొలుత గుర్తొచ్చేది టిక్‌టాక్‌. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లలో భారత్‌ నుంచి దాదాపు 30 శాతం ఉంటాయి. భారత్‌లో ఇప్పటివరకు టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లు 61 కోట్ల వరకు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే భారత్‌ విపణికి టిక్‌టాక్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ ఇప్పటికే భారత్‌లో 10 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. మరో 100 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టే యోచనలోనూ ఉంది. కొత్తగా 1000 నియామకాలను చేపట్టేందుకూ సిద్ధమైంది. అయితే ఇప్పుడు టిక్‌టాక్‌పై భారత్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఈ పెట్టుబడి ప్రణాళికలపై అనిశ్చితి నెలకొన్నట్లుగానే భావించవచ్చు. మరోవైపు టిక్‌టాక్‌ మొత్తం ఆదాయంలో 10 శాతం వరకు భారత్‌ నుంచే వస్తున్నట్లు అంచనా. యాప్‌ నిషేధంతో భారత్‌లో రోజుకు 5,00,000 డాలర్ల మేర నష్టం వస్తుందని బైట్‌ డాన్స్‌ చెబుతోంది. అంటే భవిష్యత్‌ పెట్టుబడులపై ప్రభావం పడటమే కాకుండా ఇప్పటివరకు భారత్‌ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని కూడా టిక్‌టాక్‌ కోల్పోనుందన్నమాట. అంతేకాకుండా త్వరలోనే చైనాలో బైట్‌ డాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే యోచనలోనూ ఉంది. ఈ ప్రణాళికపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

మిగిలిన వాటి సంగతేంటి..

టిక్‌టాక్‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌ సహా వివిధ చైనా యాప్‌లకు భారత్‌లో 50 కోట్లకు పైగా క్రియాశీలక వినియోగదారులు ఉన్నట్లు తెలుస్తోంది. నిషేధం విధించిన యాప్‌ల్లో హెలో, లైక్‌, బిగో యాప్‌లకు కూడా భారత్‌లో మంచి ఆదరణ ఉంది. దీంతో వీటిల్లోని కొన్ని సంస్థలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింతగా వినియోగదారులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. మరోవైపు చైనాలోని ప్రధాన సామాజిక మాధ్యమ కంపెనీలు కూడా భారత్‌లో ఉన్న వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కు ఇప్పటివరకు ఖాతాదార్లు కాని వారిని, కొత్త ఖాతాదార్లను సంపాదించే పనిలో ఉన్నాయి. అయితే యాప్‌ల నిషేధం ప్రభావంతో వీటి ప్రణాళికలకు అడ్డుకట్ట పడినట్లుగానే భావించవచ్చు. ఈ యాప్‌ల సృష్టికర్తల్లో కొందరు భారతీయులూ ఉన్నారు. వీళ్లకు ఈ యాప్‌లే ప్రధాన ఆదాయ వనరు. ఈ యాప్‌లకు భారత్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే ఉద్యోగులు కూడా చాలా వరకు భారతీయులే. యాప్‌లు నిషేధంతో వీరి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఈ యాప్‌ల ద్వారా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా భారత్‌లో ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు యాప్‌ల నిషేధం ప్రభావం వీరిపైనా పడనుంది.

అంకురాలకు అండగా నిలుస్తాయా..

2018లో భారత కంపెనీల్లో చైనా సంస్థలు 5 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులుగా పెట్టాయి. యాప్‌ల్లోనే కాదు.. ఇ-కామర్స్‌, ఆన్‌లైన్‌ చెల్లింపు ప్లాట్‌ఫామ్స్‌లోనూ చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 2024 నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగదార్ల సంఖ్య రెట్టింపై 125 కోట్లకు చేరొచ్చని అంచనాల నేపథ్యంలో ఈ పెట్టుబడులను మరింతగా పెంచుకునే ఉద్దేశంలో చైనా సంస్థలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అంకురాల్లో పెట్టుబడిన పెట్టిన చైనా సంస్థలు.. మున్ముందు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తాయా? లేదా? అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టమే. ఇప్పటికైతే నిషేధ ఆంక్షల నుంచి పేటీఎం, బైజూస్‌ లాంటి సంస్థలను ప్రభుత్వం మినహాయించినప్పటికీ, భవిష్యత్‌లో చైనా సంస్థల పెట్టుబడులపై ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకుంటే చైనా పెట్టుబడులన్ను భారత అంకురాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలాంటి భిన్నాభిప్రాయల నేపథ్యంలో యాప్‌ల నిషేధం తర్వాత చైనా సంస్థల పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

చైనా యాప్‌ల నిషేధం ప్రభావం

  • భారత్‌లో అధికంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న తొలి 10 యాప్‌ల్లో 6 చైనావే.
  • భారత్‌లోని 30 ప్రధాన అంకుర సంస్థల్లో 18 వాటిల్లో చైనా పెట్టుబడులు.
  • భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా తయారీ సంస్థల వాటా 72 శాతం.

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటంతో భారత్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చైనా సంస్థలు ఎంతలా దృష్టి సారించాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మరిన్ని పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలను కూడా ఇవి సిద్ధం చేసుకున్నాయి. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ (బాయ్‌కాట్‌) ఉద్యమం నడుస్తోంది. భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉండటంతో చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్‌లపైనా ప్రభుత్వం నిషేధమూ విధించింది. ఈ పరిణామాలతో భారత్‌లో చైనా సంస్థల పెట్టుబడుల ప్రణాళికలపై పడినట్లేనా..? ప్రభావం ఉంటే అది ఎంత..?

టిక్‌టాక్‌ వాడకం ఇలా..

  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం డౌన్‌లోడ్లలో భారత్‌ నుంచే 30%
  • క్రియాశీలక వినియోగదార్లు 20 కోట్లు
  • 2019లో టిక్‌టాక్‌ను భారత్‌లో 550 కోట్ల గంటల సమయం వినియోగించారు.
  • 2019 డిసెంబరు నాటికి భారత్‌లో టిక్‌టాక్‌ క్రియాశీలక వినియోగదారులు 90 శాతం పెరిగారు.
  • 2019 డిసెంబరులో భారత్‌లో టిక్‌టాక్‌కు కోసం వినియోగదారులు వెచ్చించిన సమయం.. భారత్‌ తర్వాతి స్థానంలో ఉన్న 11 దేశాల్లో వినియోగదారులు వెచ్చించిన మొత్తం సమయానికి దాదాపు సమానం.
  • చైనా బయట టిక్‌టాక్‌కు అత్యంత ఆదరణ ఉన్నది భారత్‌లోనే. 2018 జనవరి నుంచి యాప్‌స్టోర్‌, గూగుల్‌ ప్లేలో టిక్‌టాక్‌ డౌన్‌లోడ్ల సంఖ్య 65 కోట్లుగా నమోదైనట్లు సెన్సార్‌ టవర్‌ ఆధారంగా తెలుస్తోంది.
  • ఏప్రిల్‌ నుంచి ఇండియాస్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న తొలి 25 యాప్‌ల్లో ఎనిమిది చైనావే కావడం గమనార్హం.

ఇదీ చూడండి:డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ABOUT THE AUTHOR

...view details