ఐఫోన్ స్లోడౌన్ బాధిత వినియోగదారులకు యాపిల్ సంస్థ రూ.1,800 చెల్లించనుంది. 2017లో బ్యాటరీ సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా ఐఫోన్లు నెమ్మదించిన కేసులో 500 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు కాలిఫోర్నియా శాన్‌జోస్ జిల్లా జడ్జీ ఆమోదం పొందాల్సి ఉంది.
2017 డిసెంబర్ 21న ఐఓఎస్ 10.2.1 అప్డేట్ను అందిచ్చింది యాపిల్. దీనిని ఇన్స్టాల్ చేసుకున్న ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్, 6ఎస్ ప్లస్, 7, 7ప్లస్, ఎస్ఈ మోడల్ మొబైళ్లు నెమ్మదించాయి. వీటిని మీరు ఆ సమయంలో కలిగి ఉంటే మీకూ ఆ మొత్తం అందుతుంది.
ఉద్దేశపూర్వకంగా..!
2017లో కొన్ని ఐఫోన్లు స్లోడౌన్ అయ్యాయని యాపిల్ ఒప్పుకుంది. అయితే ఇదంతా ఆయా ఫోన్ల జీవితకాలం పెంచడం కోసమే చేసినట్లు తెలిపింది.
యాపిల్ ఉద్దేశపూర్వకంగానే పై మోడళ్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ పంపించింది. దీనిలో డైనమిక్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా ఆయా ఐఫోన్లు స్లోడౌన్ అయ్యేలా యాపిల్ చేసింది.
వినియోగదారులు చాలా కాలంగా తమ ఐఫోన్ల పనితీరు నెమ్మదించడాన్ని గమనిస్తూనే ఉన్నారు. వినియోగదారులు కొత్త ఐఫోన్లు కొనుగోలు చేసేలా చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని వారు గుర్తించారు.
ఫ్రాన్స్‌లో రూ.195 కోట్లు..
తొలుత ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన డీజీసీసీఆర్ఎఫ్ గుర్తించింది. యాపిల్‌పై సుమారు రూ.195 కోట్ల జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాపిల్ అంగీకరించింది. అలాగే తన ఫ్రెంచ్ భాషా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రకటనను ఒక నెల పాటు ప్రచురించింది. దీని ఆధారంగా ప్రస్తుత కేసును కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ కోర్టు విచారిస్తోంది.
కొత్తవి కొనాల్సిందే!
పాత ఐఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం చాలా తక్కువ. దీనికి తోడు ఐఫోన్ అప్డేట్తో అవి మరింత స్లోడౌన్ అయ్యాయి. దీని వల్ల ఐఫోన్ల జీవితకాలం తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారులు కచ్చితంగా కొత్త బ్యాటరీలు మార్చాల్సి ఉంటుంది. లేదా కొత్త ఫోన్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇదే యాపిల్ ఎత్తుగడ!
ఇదీ చూడండి:ఐఫోన్లు స్లోడౌన్.. యాపిల్‌కు రూ.195 కోట్లు జరిమానా